- కడియం పై ఎమ్మెల్యే రాజయ్య ఘాటు విమర్శలు
స్టేషన్ ఘనపూర్: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం నాడు జఫర్గడ్ మండల్ హిమ్మత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై రాజయ్య హాట్ హాట్ కామెంట్స్ చేశారు. రాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ ఆరుద్ర పురుగు లాగా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.
ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఇంటి కిటికీలకు గోనె సంచులు ఉండే. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నీతిమంతుండని మాట్లాడుతున్నావు , నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో నువ్వు గంతే. కడియం శ్రీహరి అవినీతి తిమింగళం. మంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం పని చేశావో అన్నీ నాకు తెలుసు నా దగ్గర ఒక పుస్తకం ఉందని అన్నారు. అవసరం వచ్చినప్పుడు పుస్తకం బయటపెట్టి నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో బయట పెడతా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఘనపూర్ నియోజకవర్గానికి కుదవబెట్టి సింగపూర్ మలేషియాలో ఆస్తులు సంపాదించావని అన్నారు. ఖానాపూర్ నడిబొడ్డున నేను పుట్టాను నా అడ్డా గడ్డ గణపురమే. 2014 …18 ఎన్నికల కోసం నా ఆస్తులన్నీ అమ్ముకున్నా. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్న చరిత్ర నాది అయితే ఆస్తులు కొనుక్కున్న చరిత్ర నీది. ఎప్పుడు రానిది మళ్లీ మీ ముందుకు ఊసరవెల్లి రంగులు మారినట్టు వస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడపడితే అక్కడ దొంగ సాటు మీటింగులు పెడుతున్నావు. నువ్వు నిజమైన బిఆర్ఎస్ నాయకుడివి అయితే రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టు .. నువ్వు నేను చూసుకుందామని అన్నారు.
పార్టీ నుండి బహిష్కరించబడిన వారు మాత్రమే నీతో ఉంటున్నారు. పార్టీ పైనా అసంతృప్తులుగా ఉన్నా వాళ్లే ఆయన వెంట ఉంటున్నారని విమర్శించారు. ఈరోజు నుండి ఎన్నికల వరకు ప్రతిరోజు తిరుగుతా , ప్రతి ఊరిలో డప్పు కొడుతా. పైసలిచ్చి గెలిచే రోజులు పోయినాయి. నియోజకవర్గంలో నాలాగా ఉరకాలంటే నీ గుండె ఆగిపోతుంది. ప్రతిపక్షాల పప్పులు ఉడకకుండా కేసీఆర్ మొండి కెసిఆర్ ను మించిన నేను జగమొండిని. అభివృద్ధి కార్యక్రమాలలో ఈరోజు కూడా కొబ్బరికాయ కొట్టని నేతలు కూడా అభివృద్ధి చేసిన అని సిగ్గు శరం లేకుండా చెప్తున్నారు. 20 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరమై , ప్రజలకు దూరమై తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ రాజకీయాన్ని తన వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడని మండిపడ్డారు.