కాళేశ్వరం కమిషన్ తో కుదుపు
కరీంగనర్ , ఆగస్టు5, ( వాయిస్ టుడే)
The Kaleshwaram Commission's tussle
కాళేశ్వరం కమిషన్ నివేదిక బీఆర్ఎస్ పార్టీలో కుదుపు మొదలైందా? ఆ పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారా? బీఆర్ఎస్లో పొలిటికల్ కెరీర్ ఉండదని కొందరు నేతలు డిసైడ్ అయ్యారా? దాదాపు డజను మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? వీరితోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలతో బీఆర్ఎస్ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? అవుననే సంకేతాలు ఆ పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగినట్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. దీనిపై సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ మొదలు కీలక మంత్రులంతా మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సింది చెప్పారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని, ఆ తర్వాత ఏం చెయ్యాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి. కాలేశ్వరం కమిషన్ రిపోర్టుపై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతోంది? అధికార పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటన్నది ఆధారపడి ఉంటుందా? కమిషన్ నివేదికను కారు పార్టీ నేతలు తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సిట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా దర్యాప్తు చేస్తుందని ఆ పార్టీ నేతలు రీసౌండ్ చేస్తారని భావిస్తోంది. అదే సీబీఐకి ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన చేస్తోందట అధికార పార్టీ. ఇప్పుడు అధికార పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తుందనేది అసలు ప్రశ్న. కమిషన్ రిపోర్టు బయటకు రాగానే పార్టీ నేతలతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికపై దాదాపు ఆరుగంటలకు పైగానే చర్చించారు. సోమవారం నాడు జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనించిన కేసీఆర్, నేతలను అలర్ట్ చేశారు. దర్యాప్తు పేరుతో ఎప్పుడైనా, ఎవరినైనా అరెస్టు చేసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేతలను హెచ్చరించారు. ఆనాటి మంత్రులతోపాటు తనను విచారణకు పిలిచి అరెస్టు చేస్తారని ముందుగానే సంకేతాలు ఇచ్చారు పెద్దాయన. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆలోచనలోపడ్డారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే బీజేపీ సాయం లేకుంటే కష్టమని అంటున్నారు. పార్టీని విలీనం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తే పరిస్థితి ఉందని అనుకుంటున్నారు. అలా చేసే బదులు మనకు జారుకుంటే బెటరని దాదాపు డజను మాజీ ఎమ్మెల్యేలు ఓ అంచనాకు వచ్చనట్టు తెలుస్తోంది. వీరు కాకుండా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారే పనిలో ఉన్నట్లు ఫీలర్లు వస్తున్నాయి. పార్టీ మారే విషయంలో జాతీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత జాయిన్ కావాలని ఆలోచన చేస్తున్నారట. ఏ నీళ్ల కోసం కొట్లాడి తెలంగాణను సాధించామని బీఆర్ఎస్ నేతలు పదేపదే రాజకీయ స్పీచ్‌లు ఇస్తున్నారు. అదే నీటి ప్రాజెక్టు కారు పార్టీని నిట్ట నిలువునా ముంచేసిందనే చెప్పవచ్చు
కాకా రేపుతున్న రాజీనామాలు
బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ కేసీఆర్‌కు పంపించారు. ఈ లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజీనామా నిర్ణయం అంత ఈజీగా తీసుకున్నది కాదని.. ఎంతో ఆలోచించి, ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత బాధతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపిన గువ్వల.. కష్ట సమయంలో పార్టీని వీడడం బాధగా ఉందన్నారు. అయినా భవిష్యత్తు కోసం తప్పడం లేదని లేఖలో తెలిపారు.కాగా గువ్వల బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గువ్వలతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈ నెల 10న కమలం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా 2009లో నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన గువ్వల మంద జగన్నాథం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అచ్చంపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపై భారీ మెజార్టీతో గెలించారు. 2018లోనూ మరోసారి విజయకేతనం ఎగురవేశారు. 2022లో నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.కాగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయింగా.. ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం చెప్పింది. అంతేకాకుండా పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇప్పుడు గువ్వల బాలరాజు సైతం ఆ లిస్ట్‌లో చేరారు. అయితే ఎవరు పోయిన పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా గువ్వల రాజీనామాపై ఎలా స్పందిస్తారో చూడాలి.



