కాళేశ్వరం… శాపమా…వరమా
హైదరాబాద్, ఆగస్టు 7, (వాయిస్ టుడే )
Kaleshwaram... a curse... a blessing
రెండేళ్ల క్రితం వరకు తిరుగులేని శక్తిగా వెలుగొందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఇప్పుడు ఇంటాబయటా పెనుసవాళ్లను ఎదుర్కొంటోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అంతర్గత కలహాలు, పార్టీ నాయకత్వం ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం వంటి పరిణామాలు బీఆర్‌ఎస్ బలహీనపడుతుందనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పార్టీ హార్డ్‌కోర్ కార్యకర్తలు, అభిమానులను కలవరపెడుతున్నాయి.బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఆ పార్టీకి పెను శాపంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని పేర్కొనడం కేసీఆర్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. ఒక ప్రాజెక్ట్ వైఫల్యం, దానిపై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ నైతిక బలంపై ప్రభావం చూపుతాయి. ఈ నివేదిక బీఆర్‌ఎస్ కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసు, కేటీఆర్‌పై ఫార్ములా కార్ రేస్ కేసు వంటివి కూడా పార్టీకి ప్రతికూలంగా మారాయి.కాళేశ్వరం సంక్షోభం ఒకవైపు ఉండగానే, మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలి పార్టీలో గందరగోళానికి కారణమవుతోంది. సొంత పార్టీ నాయకులపై, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరోక్ష విమర్శలు చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరును స్పష్టం చేస్తున్నాయి. ఈ కుటుంబ కలహాలు క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నాయి. నాయకత్వంలో ఐక్యత లేకపోవడం పార్టీ పటిష్టతకు పెద్ద అవరోధంగా మారుతుంది. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు తనకు పార్టీ అండగా లేదని పదే పదే చెబుతున్న కవిత, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం పార్టీకి సంబంధం లేకుండా 72 గంటల నిరాహార దీక్షకు దిగారుఅధికారం కోల్పోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకం. కానీ బీఆర్‌ఎస్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బలమైన ప్రతిపక్షంగా నిలబడటంలో బీఆర్‌ఎస్ నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ నిశ్శబ్దంగా ఉంది. ఇది ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇచ్చిన ప్రధాన వాగ్దానాల్లో రైతు రుణ మాఫీ, రైతు భరోసా వంటి వాటిని కూడా కాంగ్రెస్ సంపూర్ణంగా అమలు చేయలేని పరిస్తితి ఉంటే దీనిపై కేవలం మాజీ మంత్రి హరీష్ రావు లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే ఆందోళన చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పార్టీగా మారిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కుటుంబేతర నేతల వైపు చూడాల్సి వచ్చినా ఎవరూ ఆ స్థాయిలో స్పందించలేని దుస్థితి.బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఊహాగానాలు కూడా పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయి. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన అనుచరుల వద్ద ఈ ఊహాగానాలను ప్రస్తావిస్తూ పార్టీకి రాజీనామా చేయడం దీనికి తాజా ఉదాహరణ. ఇది పార్టీ నాయకత్వం, భవిష్యత్తుపై ఉన్న సందేహాలకు అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నమ్ముకున్న నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలన్న కుట్ర జరుగుతోందంటూ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత వ్యాఖ్యానించడం పార్టీ నేతలు ఇతర పార్టీలకు వలస వెళ్లేలా ప్రేరేపించినట్టయింది.బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపకపోవడం, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకపోవడం వంటివి పార్టీ నాయకత్వంలో ఉన్న స్తబ్దతకు నిదర్శనాలు. పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం కార్యకర్తల్లో నిరాశను కలిగిస్తోంది. ఒక బలమైన నాయకుడు లేకపోవడం వల్ల పార్టీని నడిపించేందుకు సరైన దిశానిర్దేశం కొరవడింది.ఈ పరిణామాలన్నీ బీఆర్‌ఎస్‌కు ఒక సవాల్‌గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నివేదిక, కుటుంబంలో ఆధిపత్య పోరు, బలహీనమైన ప్రతిపక్ష పాత్ర, నాయకత్వ స్తబ్దత వంటి కారణాలు బీఆర్‌ఎస్‌ను బలహీనపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల చర్చ కూడా ఇదే రీతిలో సాగుతోంది. పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని ప్రజలు, కార్యకర్తల నుంచి ఆశాభావం వ్యక్తమవుతోంది. కానీ బీఆర్ఎస్‌లోని ఈ పరిణామాలను కాంగ్రెస్, బీజేపీ సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహాలను రచించే సూచనలు కనిపిస్తున్నాయి.



