
వాషింగ్టన్ డీసీలో జరిగిన గ్లోబల్ మున్నూరుకాపు మహాసభలో ఎంపీ వద్దిరాజు ఉత్తేజిత ప్రసంగం
వాయిస్ టుడే:
MP Vaddiraju's inspiring speech at the Global Munnurukapu Conference held in Washington DC


బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రకటించి, మేనిఫెస్టోలో పెట్టి, పలుమార్లు ఊదరగొట్టి, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో పొందుపర్చకుండా రిజర్వేషన్స్ అమలు సాధ్యం కాదని తెలిసి కూడా ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ మభ్యపెట్టిందని ఆయన మండిపడ్డారు.గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యాన అమెరికాలోని లీస్ బర్గ్ వద్ద మహాసభ (కన్వెన్షన్) ఏర్పాటైంది.ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ సభకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఆదివారం రాత్రి (ఇండియా లో సోమవారం ఉదయం) మాట్లాడుతూ, కాంగ్రెస్ సర్కార్ మున్నూరుకాపుల జనాభాను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపడమే కాక మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన మున్నూరుకాపు ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ ను వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎంపీ రవిచంద్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.మున్నూరుకాపులం సమాజానికి పెద్ద దిక్కుగా ఉంటూ కాపు కాసే వారమని, రైతుబిడ్డలమని, పదిమందికి అన్నం పెట్టే అన్నదాతలమన్నారు.మనం ఇటువంటి మంచి సభల ద్వారా మరింత సంఘటితమవుతూ ఇతర బీసీ కులాల వారితో స్నేహంగా ఉంటూ రాజ్యాధికారం వైపు పయనిద్దామని ఎంపీ రవిచంద్ర పిలుపునిచ్చారు.ఈ విషయంలో మనం పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుద్దామని,2019లో ఆయన పార్టీ ఓకే ఒక్క సీటు గెలిచినా కూడా నిరాశ చెందకుండా ముందుకు సాగుతూ 2024లో పోటీ చేసిన అన్ని సీట్లను జనసేన గెల్చుకున్నదన్నారు.విదేశాలలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు గత ఎన్నికల సందర్భంగా తమ తమ స్వస్థలాలకు వెళ్లి ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.అదేవిధంగా మన తెలంగాణ బిడ్డలు వీలు చూసుకుని స్వగ్రామాలను సందర్శిస్తూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలని,ఆసక్తి ఉన్న వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంపీ వద్దిరాజు దిశానిర్దేశం చేశారు.మున్నూరుకాపులం ఆర్థికంగా ఎదిగేందుకు తమ పిల్లలను బాగా చదివించాలని,గుజారాతీలను ఆదర్శంగా తీసుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని సలహానిచ్చారు.తాను 30 ఏండ్ల కిందట గాయత్రి గ్రానైట్స్ కంపెనీ స్థాపించి కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి 2వేల మందికి ఉద్యోగాలిచ్చానని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఢిల్లీలోని జాతీయ పోలీస్ మెమోరియంలో నెలకొల్పిన 370 టన్నుల మ్యాన్యుమెంట్,కర్తవ్యపథ్ లో ప్రతిష్ఠించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు బ్లాక్ గ్రానైట్ అందించానన్నారు.మాజీ మంత్రి కే.టీ.రామారావు ఐటీ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని,3 నెలల కిందట డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ సభ జరిగినప్పుడు ఆయనపై అభిమానంతో వేలాది మంది యువకులు హాజరైన విషయాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.అమెరికాకు వచ్చే,వచ్చిన యువతకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరిస్తూ కొండంత అండగా నిలవాలని గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్,ఆప్తా, నాట్స్,ఆటా సభ్యులను ఎంపీ రవిచంద్ర కోరారు.ఇమ్మిగ్రేషన్,వీసా విషయాలలో,చిరు వ్యాపారులు,పేద విద్యార్థులకు ఇక్కడ స్థిరపడిన మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇక్కడి ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగాలు రాక, కోల్పోయిన వారికి ఆశ్రయం కల్పించేందుకు వాషింగ్టన్,చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీ,లాస్ ఏంజిల్స్ వంటి నగరాల శివార్లలో భూములు కొని భవనాలు కట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు సూచించారు.విదేశాలలో ఇబ్బందులకు గురైన తెలంగాణ బిడ్డలకు తనతో పాటు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎంపీ వద్దిరాజు భరోసానిచ్చారు.దేశమంతా కూడా ఇప్పుడు బీసీ వాదం బలంగా వినిపిస్తున్నదని, మున్నూరుకాపులం ఎవరి కంటే కూడా తక్కువ కాదని,ఇతరులను కించపర్చకుండా కలుపుకుంటూపోతూ నాయకత్వం వహించాల్సి ఉందన్నారు.మున్నూరుకాపులతో పాటు బీసీలను మరింత చైతన్య పర్చేందుకు,సంఘటితం చేసేందుకు ఈ మహాసభను ఏర్పాటు చేసిన రజనీకాంత్,వెంకట్,వారి మిత్ర బృందాన్ని ఎంపీ వద్దిరాజు అభినందించారు.అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన మీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, బహుజనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని ఎంపీ వద్దిరాజు అన్నారు. బతుకమ్మ,దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగిందని, రుచికరమైన మన తెలంగాణ వంటకాలతో కడుపునిండా భోజనం చేశామన్నారు.ఈ సందర్భంగా మహాసభ నిర్వాహకులు ఎంపీ రవిచంద్రను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను ప్రదానం చేశారు.అంతర్జాతీయ షూటింగ్ పోటీలలో ప్రతిభాపాటవాలు చాటుతూ సిల్వల్ మెడల్స్ గెల్చుకున్న పోలీస్ అధికారి సాధుల సారంగపాణి కూతురు మేఘన ను ఎంపీ రవిచంద్ర శాలువాతో సత్కరించి, జ్ఞాపికను ప్రదానం చేశారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో రెండు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ మహాసభలో ఇండియాలోని పలు రాష్ట్రాలు,అమెరికా,కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,ఖతర్ తదితర దేశాలలో నివసిస్తున్న వందలాది పాల్గొన్నారు.మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాయచూరు మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్,ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్,సుంకర బాలకిషన్,చల్లా హరిశంకర్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,కొండా దేవయ్య,ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు,చల్లా స్వరూపరాణి, మిరియాల రాఘవరావు, డాక్టర్ శివప్రసాద్,రాజలింగోళ్ల శృంగాద్రి కుమార్,గంగవ్వ,జయశ్రీ, తదితర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.ఈ మహాసభ సందర్భంగా వేసిన రంగురంగుల ముగ్గులు (రంగవల్లులు)అందరిని ఆకర్షించాయి, ఏర్పాటు చేసిన సింగీత విభావరి, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.





