ఎంపీ వద్దిరాజు ఖమ్మంలో దుర్గామాత ఆగమన ఉత్సవాలను ప్రారంభించారు
ఖమ్మం బైపాస్ రోడ్డు శ్రీవెంకటేశ్వర నగర్ టీఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద దసరా నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభం
Vaddiraju condemns Ponguleti's comments

ఉత్సవాలకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై దుర్గాభవాని విగ్రహాన్ని ఆవిష్కరించారు
దుర్గామాత ఆశీస్సులు ఖమ్మం జిల్లా ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో కరువు కాటకాలు లేకుండా, పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఎంపీ రవిచంద్ర ప్రార్థించారు. ఖమ్మం 48వ డివిజన్ శ్రీవెంకటేశ్వర నగర్ ఏఫ్సీఐ గోడౌన్స్ టీఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోట రామారావు,కార్పోరేటర్ తోట గోవిందమ్మల ఆధ్వర్యాన దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా నెలకొల్పిన దుర్గాభవాని విగ్రహం వద్ద ఆగమన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరు కాగా,ఆయన అనుచరులు, అభిమానులు బాణాసంచా కాల్చుతూ,డప్పులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తోట రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,హైదరాబాద్ నగరానికే పరిమితమయ్యే దుర్గామాత ఆగమన వేడుకలు ఖమ్మంలో కూడా జరుపుతుండడం అభినందనీయమన్నారు. తొమ్మిది రోజులపాటు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.ఆ తర్వాత తోట రామారావు-గోవిందమ్మల కుమారులు రమేష్ కుమార్ -డాక్టర్ లక్ష్మణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి చేత కేక్ కట్ చేయించి హాజరైన వారందరి హర్షధ్వానాల మధ్య వేడుకలను ఘనంగా ప్రారంభించారు.
పొంగులేటి వ్యాఖ్యలను ఖండించిన వద్దిరాజు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. పొంగులేటి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేటీఆర్ తో స్నేహం చేసిన విషయం మరిచారా అని ఆయన ప్రశ్నించారు. బచ్చేగాడు అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరమని,2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ మట్టి కరిపించడాన్ని ఒక సారి గుర్తు చేసుకోవాలని ఎంపీ రవిచంద్ర అన్నారు. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్తు లో ప్రజలే తగిన సమాధానం చెప్తారని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, ఎంపీ రవిచంద్ర అనుచర గణం పాల్గొన్నారు.



