సంయమనంతో ఉండండి
వైసీపీ ట్రాప్లో పడొద్దన్న చంద్రబాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 2
Stay calm
Don’t fall into YCP trap, says Chandrababu
ఆంధ్రప్రదేశ్లో హింసను ప్రేరేపించటానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని, ఏపీలో అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. సోమవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలు చాలా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా వైసీపీ ట్రాప్లో పడొద్దు అని సూచించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు కామెంట్లు తరువాత జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు.తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని, వారిని ఏపీ ప్రజలు, భక్తులు చీదరించుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వారు చేసిన పాపాలను దారిమళ్లించాలనే కుట్రలో భాగంగా వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని పార్ట నేతలకు సూచించారు. మనం పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే అది వైకాపా నేతలకు నచ్చడం లేదు. అందుకే కూటమి నేతలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదు. వైసీపీ ట్రాప్ లో పడి చట్టాన్ని చేతుల్లోకి మాత్రం తీసుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలతో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. నిన్న జరిగిన సంఘటనపై పార్టీ జాతీయ అధ్యక్షులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. అయితే అలాంటి పాలనను వ్యతిరేకించాం. కానీ ఇప్పుడు మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన మార్గం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు, ప్రేరణలకు లోనై స్పందించాల్సిన అవసరం లేదని సూచించారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని గౌరవించే వారిగా సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, అదే మన పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ 2026 కూడా వికసిత్ భారత్ లక్ష్యాలకు, స్వరాంధ్ర 2047 దిశగా రూపొందించారని తెలిపారు. అమరావతికి రూ.1088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ.500 కోట్లు, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, అరుదైన ఖనిజాల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.



