Saturday, February 14, 2026

పార్టీల్లో  రెబల్స్  గుబులు

- Advertisement -

పార్టీల్లో  రెబల్స్  గుబులు
కరీంనగర్, అదిలాబాద్, ఫిబ్రవరి 7

Rebels in the parties
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల క్లైమాక్స్ మొదలైంది. పార్టీలు జారీ చేసిన బీ-ఫారాలు ఒకరికి దక్కితే, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన తమను విస్మరించారంటూ పలువురు నేతలు స్వతంత్రులుగా జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,700 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నప్పటికీ, ఇంకా 12,900 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మెజారిటీ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన రెబల్స్ కావడం గమనార్హం. గెలుపు గుర్రాల కంటే, ప్రత్యర్థి గెలుపును అడ్డుకునే  ఓట్ల చీలిక వ్యూహంతో వీరు ముందుకు వెళ్తుండటం పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా ఉంది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ సమస్య అత్యధికంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావించిన ఆశావాహులు టికెట్ ఆశించారు.  కానీ ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత క్యాడర్ భగ్గుమంటోంది. ఉదాహరణకు జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి ,  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య టికెట్ల కేటాయింపు వివాదం రచ్చకెక్కింది. ఇలాంటి పరిస్థితులే మెదక్, గద్వాల వంటి చోట్ల కూడా కనిపిస్తున్నాయి.  బీ-ఫారాల  పంపిణీలో జరిగిన జాప్యం ,  సమన్వయ లోపం వల్ల కాంగ్రెస్‌లో రెబల్స్ సంఖ్య పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. పార్టీని నమ్ముకుని ఉన్న స్థానిక నేతలు, టికెట్ దక్కని పక్షంలో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని భావించి బరిలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత పార్టీ వారే భారీగా నామినేషన్లు వేశారు. కొందరు నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కంటే, సొంత పార్టీ అభ్యర్థులనే టార్గెట్ చేయడం అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు జారీ చేసినా చాలా మంది వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలోనూ పుంజుకుంటున్నామన్న ధీమాతో ఉన్న బీజేపీలోనూ రెబల్స్ బెడద తప్పలేదు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ, కొన్ని చోట్ల ఆర్ఎస్ఎస్  బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి కాకుండా కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు రెబల్స్ పై సీరియస్ అయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ, నిజామాబాద్, అదిలాబాద్ వంటి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు రెబల్స్ గట్టి పోటీ ఇస్తున్నారు.ఈ రెబల్స్ ప్రభావం వల్ల బహుముఖ పోటీ    నెలకొంది. విజేతను నిర్ణయించే మేజారిటీ ఓట్లు ఈ స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కేవలం 100 నుండి 500 ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయమయ్యే మున్సిపల్ వార్డుల్లో, ఈ రెబల్స్ చీల్చే 50 ఓట్లు కూడా ఫలితాన్ని తారుమారు చేస్తాయి. దీనివల్ల కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓడిపోయి, స్వతంత్రులు కింగ్ మేకర్లుగా లేదా విజేతలుగా అవతరించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో ఈ రెబల్స్ ఎవరి కొంప ముంచుతారో, ఎవరికి వరం అవుతారో తేలిపోనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్