సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్
నిజామాబాద్, ఫిబ్రవరి 12, (వాయిస్ టుడే)
BRS turns sentiment into a weapon
తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై వేస్తామని ప్రకటించిన జుడీషియల్ కమిషన్ ప్రకటన అధికార పక్షానికి ఒక రకంగా సెల్ఫ్ గోల్‌గా మారింది. అశాస్త్రీయంగా ఏర్పడిన జిల్లాలను రేషనలైజేషన్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడే, విపక్షాలకు ఒక బలమైన రాజకీయ అస్త్రం దొరికింది. ముఖ్యంగా భూపాలపల్లి వంటి జిల్లాల రద్దుపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, ప్రభుత్వం చాలా కాలం పాటు మౌనం వహించడం వ్యూహాత్మక తప్పిదంగా మారింది. రద్దు ఉండదని ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నప్పటికీ, అప్పటికే జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిందన్నది విశ్లేషకులఅభిప్రాయం.
జిల్లాలను మార్పు చేసేందుకు కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే, బీఆర్ఎస్ దీన్ని ఒక సెంటిమెంట్ అస్త్రంగా మలుచుకుంది. మేము తెచ్చిన జిల్లాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది అంటూ ప్రజల్లో భావోద్వేగాల రాజకీయం చేయడంలో గులాబీ దళం సఫలమైంది. భూపాలపల్లి వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా చొచ్చుకుపోయింది. ప్రజల్లో సెంటిమెంట్ గూడుకట్టుకున్న తర్వాత ఇప్పుడు జిల్లాల రద్దు ఉండదు అని ప్రకటించడం, “నష్టం జరిగిన తర్వాత మేల్కొనడం లాంటిదేనని భావిస్తున్నారు. అసలు ఉనికిలో లేని సికింద్రాబాద్ జిల్లా గురించి కూడా ప్రచారం జరిగిందంటే, ప్రభుత్వం తన
విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతటి వైఫల్యాన్ని మూటగట్టుకుందో అర్థమవుతోందన్న నిరాశ కాంగ్రెస్ క్యాడర్‌లో కనిపిస్తోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని,దానిపై అధ్యయనం అవసరమని పేర్కొన్నారు.
ఈ అస్పష్టతే విపక్షాలకు వరంగా మారింది. ఏ జిల్లాను రద్దు చేస్తారో లేదా వేటిని విలీనం చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం వల్ల సామాన్య ప్రజల్లో అనుమానాలు తలెత్తాయి.
ఇప్పుడు రద్దు చేయబోమని చెబుతున్నా, భవిష్యత్తులో అడ్మినిస్ట్రేటివ్ రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేస్తారేమో అన్న భయం ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వ వైఖరిలో ఉన్న ఈ సందిగ్ధత భవిష్యత్తులో
పాలనాపరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందిఏదైనా ఒక సున్నితమైన అంశంపై సోషల్ మీడియాలో, క్షేత్రస్థాయిలో తప్పుబట్టే ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం అతిపెద్ద
లోపం. సమస్య జటిలమై, ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడినప్పుడు ఇచ్చే వివరణలు అపరాధ రుసుము చెల్లించినట్టుగా ఉంటాయి తప్ప, పూర్తిస్థాయి భరోసాను ఇవ్వలేవు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ జిల్లాల అంశం
ప్రతికూల ప్రభావం చూపుతుందన్న భయంతోనే ప్రభుత్వం ఇప్పుడు నాలిక కరుచుకుని వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు వెళ్తున్నాయి. బీఆర్ఎస్ చేసిన సెంటిమెంట్ రాజకీయం ఎంత మేర ప్రజల్లో ప్రభావం
చూపుతుందన్నదానిపై మున్సిపల్ ఫలితాల్లో మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


