మిడిల్ క్లాస్ సొంత ఇంటి కలనెరవేరే
హైదరాబాద్, ఫిబ్రవరి 18, (వాయిస్ టుడే)
The middle class’ dream of owning a home is fulfilled
హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మధ్య మిడిల్ క్లాస్ ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఈ ఇళ్ల నిర్మాణం ఉంటుందని అన్నారు.హైదరాబాద్ నగరంలో లేదా శివారు ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలని మధ్య తరగతి ప్రజలు కలలు కంటుంటారు. అయితే ప్రస్తుతం ఇళ్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. శివారు ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలు లక్షల్లో పలుకుతున్నాయి. దాదాపు రూ.60-70 లక్షలు వెచ్చించనిదే ఇల్లు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు – ఔటర్ రింగు రోడ్డు పరిధిలో మధ్య తరగతి ప్రజల కోసం తక్కువ ధరకే ఇళ్లను నిర్మించి ఇస్తామని పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో హౌసింగ్ పాలసీపై మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన పొంగులేటి గతంలో కేపీహెచ్‌బీలో నిర్మించిన మాదిరిగానే ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇందుకోసం నాలుగు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి పది రోజుల్లో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, కనీసం వంద ఎకరాల్లో ఈ టౌన్‌షిప్‌ను అందుబాటులో తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని గతంలోనే మంత్రి పొంగులేటి తెలిపారు.ఇక రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసించే పేద, అల్ప ఆదాయ, మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో తక్కువ ధరలకే ఇళ్లను అందించేందుకు సర్కార్ రెడీ అయింది. ఈ మేరకు ఎఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులోగా అందుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను రేవంత్ ప్రభుత్వం రూపొందించనుంది. ఈ మేరకు పాలసీ రూపకల్పనకు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ ద్వారా సీబీఆర్‌ఐ కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసింది.మొత్తం మూడు దశల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల సముదాయాలను నిర్మించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మురికివాడల్లోనే పలు అంతస్తుల్లో భవనాలను నిర్మించి పేద ప్రజలకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఫోర్త్ సిటీలోనూ పెద్దఎత్తున గృహ సముదాయాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వరంగల్, కరీంనగర్, నల్గొండ వంటి టైర్ -2 పట్టణాల్లోనూ ఇళ్ల టవర్లను ఏర్పాటుచేసేలా రేవంత్ ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది.



