లడ్డూలో కల్తీ నెయ్యిపై వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ధూళిపాళ్ల నరేంద్ర
YSRCP should apologize to the people for adulterated ghee in laddu: Dhulipala Narendra
అమరావతి: వాయిస్ టుడే
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు తమ తప్పును ఒప్పుకుని భక్తుల మనోభావాలను గౌరవించాలని అన్నారు.
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యి తయారు చేసిన ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి సరఫరా చేసే నెయ్యి విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఉండాలని, కానీ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు.
శాసనమండలిలో ఈ అంశాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్థించడం బాధాకరమని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. దేవుడికి సంబంధించిన ప్రసాదం విషయంలో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో, అలాగే హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ సంస్థలు ఒకటే అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ టెండర్లలో పాల్గొనాలని ఎందుకు మెయిల్స్ పంపిందని ప్రశ్నించారు.
గతంలో తనను 33 రోజుల పాటు జైలులో పెట్టి సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, కానీ ఎంత వెతికినా ఒక్క తప్పు కూడా బయటపడలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల హయాంలో కూడా తాను ఎప్పుడూ భయపడలేదని, ఇప్పుడు కూడా భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
వైసీపీ నాయకులు వెబ్‌సైట్లు డౌన్ చేయడం, మార్ఫింగ్‌లు చేయడం వంటి చర్యల్లో నిపుణులని, అవన్నీ వారి “పేటెంట్ హక్కులు”లాంటివేనని విమర్శించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
పేర్ని నాని చేసిన విమర్శలపై స్పందిస్తూ, “కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ కాళ్లమీద పడ్డ బందరు బియ్యం దొంగ పేర్ని నాని ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం” అని వ్యాఖ్యానించారు. సంగం డెయిరీ గుంటూరు రైతుల సంస్థ అని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ అని వివరించారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించబడిన విషయం వాస్తవమేనని, ఇందులో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు NDDB నివేదికల్లో వెల్లడైందని తెలిపారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమ సొమ్ము విజయవాడకు రూ.12.5 కోట్లు, చెన్నైకు రూ.7.5 కోట్లు చేరినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదికలో వెల్లడైందని చెప్పారు.
బహిరంగ మార్కెట్‌లో వెన్న ధర కిలోకు సుమారు రూ.360 ఉండగా, కేవలం రూ.316కే నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ నేతలే చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సంగం డెయిరీ 2020, 2021 నుంచే టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనడానికి ప్రయత్నించిందని, అన్ని నిబంధనలు, నాణ్యత పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే అవకాశం లభించిందని స్పష్టం చేశారు.
హెరిటేజ్ సంస్థ టీటీడీకి అసలు నెయ్యి సరఫరా చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యుత్తమ నాణ్యత గల డెయిరీ ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని, దీనిపై ఎవరైనా సందేహం ఉంటే చర్చకు సిద్ధమని ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు.
ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు చెందిన మీడియా సంస్థలకు రూ.307 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే భారతీ సిమెంట్స్ ద్వారా కాంట్రాక్టర్ల నుంచి లక్షల టన్నుల సిమెంట్ మాయం చేశారని విమర్శించారు. తనపై పెట్టిన 22 తప్పుడు కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రభుత్వం వాటిని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు.



