శేరిలింగంపల్లి బీఆర్ఎస్లో పెరుగుతున్న చేరికలు… టికెట్‌పై పోటీతో గందరగోళం
What is happening in the Serilingampally BRS party?
హైదరాబాద్, మార్చి 12 (వాయిస్ టుడే):
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక నియోజకవర్గంగా భావించే శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకోవడంతో నియోజకవర్గంలో “కారు ఓవర్‌లోడ్ అయిందా?” అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అధికార కాంగ్రెస్ నుంచి మొదలు బీజేపీ వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలు వరుసగా బీఆర్ఎస్లో చేరడం గమనార్హం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధిష్టానం, శేరిలింగంపల్లిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. నాయకత్వం బలపరచడమే కాకుండా క్యాడర్‌ను కట్టిపడేయడానికి భారీ స్థాయిలో చేరికలు చేపడుతోంది.
ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అప్పగించింది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులతో పాటు శేరిలింగంపల్లిలో కూడా పార్టీ బలోపేతం కోసం ఆయన కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా జాయినింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకొస్తున్నారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా… ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు, కొత్తగా చేరుతున్న నాయకుల సంఖ్య పెరగడంతో అంతర్గతంగా కొంత గందరగోళం నెలకొన్నట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న నేతలు, కొత్తగా వచ్చిన వారితో సమన్వయం లోపిస్తోందన్న చర్చ వినిపిస్తోంది.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరిన మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీలో కొత్తగా చేరిన ఆమెకు అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక నియోజకవర్గంలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మాజీ కార్పొరేటర్ సాయిబాబ తనకు ఇంచార్జ్ బాధ్యతలు వస్తాయని ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ కూడా ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్లు నవతా రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి కూడా తమకే టికెట్ వచ్చే అవకాశముందని అనుచరుల మధ్య చెప్పుకుంటున్నారట.
ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ కొంత అయోమయంలో ఉన్నట్టు సమాచారం. తమను ముందుండి నడిపించే నాయకుడు ఎవరు? అనే ప్రశ్న కార్యకర్తల్లో వినిపిస్తోంది. పూర్తిస్థాయి నియోజకవర్గ ఇంచార్జ్‌ను త్వరగా నియమించాలని పార్టీ లోపల డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో శేరిలింగంపల్లి కీలక నియోజకవర్గంగా ఉండటంతో వచ్చే ఎన్నికల దృష్ట్యా అన్ని పార్టీలు ఇక్కడ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌కు కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంలో భారీగా కొత్త ఓటర్లు చేరుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం చివరకు ఎవరికీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది? మిగతా ఆశావహులను ఎలా సమన్వయం చేస్తుంది? అన్నది ఇప్పుడు శేరిలింగంపల్లి రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.



