కొత్త డీజీపీ ఎవరు…
హైదరాబాద్, మార్చి 12, (వాయిస్ టుడే )
Who is the new DGP?
తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు ఢిల్లీలో యూపీఎస్సీ కమిటీ సమావేశమై.. రాష్ట్రం పంపిన ఐదుగురు ఐపీఎస్‌ల నుంచి ముగ్గురి పేర్లను ఖరారు చేయనుంది. సీనియారిటీలో సీవీ ఆనంద్ ముందుండగా.. మహిళా అధికారికి అవకాశం ఇవ్వాలనుకుంటే శిఖాగోయల్, సౌమ్యా మిశ్రాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యూపీఎస్సీ పంపే ముగ్గురి జాబితా నుంచి ప్రభుత్వం ఒకరిని ఎంపిక చేస్తుంది.తెలంగాణకు ఇప్పటి వరకు పూర్తికాలపు డీజీపీ లేరు. ప్రస్తుతం శివధర్ రెడ్డి ఇంఛార్జ్ డీజీపీగానే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పూర్తికాలపు డీజీపీ ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. యూపీఎస్సీ నేతృత్వంలోని కమిటీ ముగ్గురు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను ఖరారు చేసేందుకు నేడు సమావేశం కానుంది. యూపీఎస్సీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర సాయుధ పోలీస్ బలగాల హెడ్, రాష్ట్రం నుంచి సీఎస్ రామకృష్ణారావు సభ్యుల హోదాలో అటెండ్ కానున్నారు. తెలంగాణకు పూర్తికాలపు డీజీపీ లేకపోటవంతో డీజీపీ ఎంపికకు తుది జాబితాను యూపీఎస్సీకి పంపించాలని సుప్రీంకోర్టు గత నెల 5న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ క్రమంలోనే గత నెల 23న రేవంత్ సర్కార్ అర్హుల జాబితాను పంపించింది. ఈ జాబితా ఐదుగురి పేర్లతో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డితో పాటు, 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ , 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్‌ఆప్టే, శిఖాగోయెల్, సౌమ్యమిశ్రా తెలంగాణ క్యాడర్‌లో డీజీపీ హోదా కలిగిన ఐపీఎస్‌లుగా ఉన్నారు. వీరి పేర్లను యూపీఎస్సీకి పంపించినట్లు సమాచారం. నేటి యూపీఎస్సీ కమిటీ భేటీలో వీరిలో ముగ్గురి పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలిసిందే. సీనియారిటీ, మెరిట్ ఆధారంగా ఎంపికయ్యే వారి జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనుండగా.. వారిలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది.ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్ అందరికంటే సీనియర్. ఆ తర్వాత 1994 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీ శివధర్ రెడ్డి, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శిఖా గోయల్, జైళ్లశాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్యా మిశ్రా, కేంద్ర సర్వీస్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ అయిన సీవీ ఆనంద్ వైపు రేవంత్ ప్రభుత్వం మొగ్గు చూపుతుందా..? లేదంటే మహిళకు ఆ పోస్టు ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.మహిళకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటే శిఖాగోయల్, సౌమ్యా మిశ్రాలలో ఒకరికి అవకాశం దక్కనుంది. రాష్ట్రానికి మహిళా అధికారి ఎవరూ డీజీపీ కాలేదని.. తనకు ఆ అవకాశం ఇవ్వాలని శిఖా గోయల్ కోరుతున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యే వారు కనీసం రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనుండటంతో పోలీస్ బాస్ పోస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది.



