25న గులాబీ కండువా కప్పుకోనున్న జీవన్ రెడ్డి !
కరీంనగర్, మార్చి 17, (వాయిస్ టుడే)
Jeevan Reddy to don the ‘Pink Scarf’ on the 25th!
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్‌బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు
సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ
ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, హస్తం పార్టీ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి .. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన సంగతి
తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని.. ఆయన బహిరంగంగా మీడియా ముందే వెల్లడించడం గమనార్హం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. గతంలో బీఆర్ఎస్
పార్టీ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరగా.. అప్పటి నుంచి జగిత్యాలలో వర్గపోరు మొదలైంది.అది కాస్తా ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తారస్థాయికి చేరుకుంది. తమ వర్గం వారికి మున్సిపల్ ఎన్నికల్లో
టికెట్లు ఇవ్వలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి.. తమ అనుచరులను ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి.. గెలిపించుకుని తన సత్తా ఏంటో హైకమాండ్‌కు తెలియజేశారు. అయినప్పటికీ తనకు సరైన గుర్తింపు
లేకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తన అనుచరులతో జీవన్‌రెడ్డి చెప్పినట్లు సమచారం. ఈ నెల 25వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి
చేరనున్నట్లు తెలుస్తోంది. గత 4 దశాబ్దాలుగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన జీవన్‌రెడ్డి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా గెలిచారు. అయితే డాక్టర్ సంజయ్ కుమార్ రాకతో కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యం
లేనందునే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాలలో ఉన్న
జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను.. ఆయన అనుచరులు చించేయడం, తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం ముందు, లోపల ఉన్న కాంగ్రెస్ పార్టీ
జెండాలు, అగ్రనాయకుల ఫోటోలతో కూడిన బ్యానర్లను కార్యకర్తలు తీసేశారు. కేవలం జీవన్ రెడ్డి మాత్రమే ఉన్న ఫోటోలు, ఫ్లెక్సీలను ఉంచుతున్నారు. తాను పార్టీకి ఎంత చేస్తున్నా దాన్ని అధిష్టానం గుర్తించకపోవడంతో
తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి.. ఇక కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకోవడమే మేలు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన తర్వాతే.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి నిర్ణయం
తీసుకున్నట్లు సమాచారం.
40 ఏళ్ల అనుబంధం
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేసుకున్న మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత నాలుగు దశాబ్దాలుగా
కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి చేయి ఇచ్చి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో
పెను సంచలనంగా మారింది. టీ. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే, గత కొంత కాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను
తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. ముఖ్యంగా రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో జీవన్ రెడ్డికి పొసగడం లేదు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు జెండా
మోసిన తనకు కాకుండా, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అధిష్ఠానం ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్‌పర్శన్ పదవి
వరకు అన్ని నిర్ణయాల్లోనూ సంజయ్ కుమార్ వర్గానికి పెద్ద పీట వేశారని, దీని వల్ల జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్య తగ్గుతూ వచ్చిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను కాదని సంజయ్ కుమార్‌కు
నియోజకవర్గ పగ్గాలు అప్పగించడం, స్థానిక నిర్ణయాల్లో తన ప్రమేయం లేకుండా పోవడం ఆయనను తీవ్రంగా బాధించింది. తనకు, తనను నమ్ముకున్న అనుచరులకు పార్టీలో కనీస గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని
జీవన్ రెడ్డి భావిస్తున్నారు. సీనియర్ నేతా తన సలహాలను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇవ్వడం ఆయనకు మింగుడుపడటం లేదు. ఈ క్రమంలోనే ఆయన తన సన్నిహితులు, ముఖ్య అనుచరులతో
సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలో మనకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ కొనసాగడం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. సోషల్ మీడియా ఖాతాల
నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడం, తన అనుచరుల సోషల్ మీడియా పోస్టులు పార్టీ మార్పును ధృవీకరిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ బహిరంగంగా మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని ఆయన
కొంత సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ నెల 25న జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ
వేదికపైనే ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి, వేలాది మంది అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌తో టచ్‌లో ఉన్నారని
సమాచారం. పార్టీలో ఆయనకు సముచిత స్థానం, తగిన గౌరవం ఇస్తామని బీఆర్‌ఎస్ అధిష్ఠానం నుంచి గట్టిగా హామీ లభించినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు పెద్ద షాక్ అని
చెప్పవచ్చు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఆయనకు పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆయన నిర్ణయం వల్ల కాంగ్రెస్ బలం తగ్గే అవకాశం ఉండగా, బీఆర్‌ఎస్‌కు ఇది ఉత్తర తెలంగాణలో పెద్ద బూస్ట్‌గా మారనుంది.
జగిత్యాలలో బీఆర్‌ఎస్ బలం మళ్లీ పుంజుకోవడానికి జీవన్ రెడ్డి రాక ఒక వరంలా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.



