ప్రశ్నోత్తరాలు రద్దు చేసిన స్పీకర్..
మార్చి 20న తెలంగాణ బడ్జెట్..
హైదరాబాద్, మార్చి 17
Speaker Cancels Question Hour
Telangana Budget on March 20
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. అయితే, మొదటిరోజు షెడ్యూల్లో భాగంగా క్వశ్చన్ అవర్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బీఏసీ (BAC) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉభయ సభల ముందు ప్రవేశపెట్టనున్నారు.రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ తిరస్కరించారు. నేడు సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ రద్దు చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. బీజేపీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ బయట వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుల నుంచి సేకరించిన దరఖాస్తులను తోపుడు బండిపై ఉంచి అమరవీరుల స్థూపం వరకు తీసుకెళ్లి.. ప్రభుత్వం రైతుల పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. బీజేపీ నేతలు రైతుల దరఖాస్తులతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు.ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక వార్షిక నివేదికలను సభా సమక్షంలో ఉంచనుంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాచార కమిషన్ వార్షిక నివేదికలను సభకు సమర్పించనుండగా, మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ (8వ నివేదిక), తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (4వ నివేదిక) నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.సమావేశాల ప్రధాన అంశంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నేడు, రేపు చర్చ జరగనుంది. శాసనసభలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దానిని బలపరుస్తారు. అదేవిధంగా, శాసనమండలిలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీర్మానాన్ని ప్రతిపాదించగా, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బలపరుస్తారు. ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగంపై సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మార్చి. 19న ఉగాది సందర్భంగా అసెంబ్లీకి సెలవు. మార్చి 20న తెలంగాణ బడ్జెట్‌ను ఉభయ సభలలో ప్రవేశపెడతారు. మార్చి 21న రంజాన్, 22న ఆదివారం సందర్భంగా సెషన్‌కు విరామం ప్రకటించారు. మార్చి 23 నుంచి రాష్ట్ర బడ్జెట్‌పై ఉభయ సభలలో చర్చ జరుగుతుంది. మార్చి 26న శ్రీరామనవమి, 29న ఆదివారం నాడు విరామం ఇచ్చారు. మార్చి 30న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరిపిన తరువాత రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదిస్తుంది. ఈ సెషన్లో ఒకరోజు ఉభయసభల్లోనూ మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్షాల ప్రశ్నలు లేవనెత్తుతూ చర్చ జరగనుంది. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలకు ఈ సమయం సరిపోదని, మరికొన్ని రోజులు సభ నిర్వహించాలని బీఆర్ఎస్ కోరింది. ఆదివారాలు అయినప్పటికీ మార్చి 22, 29 తేదీల్లో సభను నిర్వహించాలని, అదే విధంగా మార్చి 31 వరకు సమావేశాలను కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.
బీజేపీ వినూత్న నిరసన
ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ నాయకత్వంలో, వారి మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నుంచి నిరసన ప్రారంభించారు. ఫసల్ బీమాను అమలు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతుల వినతులను ప్రభుత్వానికి అందజేసి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని వారు తెలిపారు. అయితే, అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తోపుడు బండిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. వినతిపత్రాలను తమకు అందజేస్తే, సంబంధిత అధికారులకు చేరవేస్తామని భద్రతా సిబ్బంది హామీ ఇచ్చారు.. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని, రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేయాలని, రైతు భరోసా నిధుల విడుదలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి బడ్జెట్లో ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వ పంటల బీమా పథకం కూడా అమలు కావడం లేదని విమర్శించారు.ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతులను మోసం చేసిందని ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. రైతు భరోసా పథకం కింద కూడా రైతులకు ఆర్థిక సాయం అందడం లేదని, తగిన సమయంలో ప్రభుత్వంపై రైతులు తమ ఆగ్రహాన్ని చూపిస్తారని హెచ్చరించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. రైతులు తమ సమస్యలను వివరిస్తూ ఇచ్చిన వినతిపత్రాలను ముఖ్యమంత్రికి అందజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని మరో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.



