రంగారెడ్డి జిల్లాలో దారుణం – భార్యను హత్య చేసి చిన్నారితో పాటు పొదల్లో పడేసిన భర్త
తేదీ: మార్చి 23, 2026 : వాయిస్ టుడే
రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యను దారుణంగా హత్య చేసిన వ్యక్తి, ఆమె మృతదేహంతో పాటు రెండేళ్ల చిన్నారిని చెట్ల పొదల్లో పడేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవునిపల్లి మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి మొదట రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి మహేందర్ (7) అనే కుమారుడు ఉన్నాడు. దాంపత్య కలహాల కారణంగా శోభారాణి అనంతరం కోయిలకొండకు చెందిన నర్సింహులు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. వీరికి మమత అనే రెండున్నరేళ్ల కుమార్తె ఉంది.
ఇటీవల నర్సింహులు మద్యం వ్యసనానికి బానిస కావడంతో, శోభారాణి పిల్లలతో కలిసి గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో, కొడుకుకి సైకిల్ కొనిస్తానని చెప్పి షాద్‌నగర్‌కు రావాలని నర్సింహులు పిలిచాడు. అయితే అక్కడికి వెళ్లిన శోభారాణిని కలవకుండా, ఆమెను మోసం చేసినట్లు తెలుస్తోంది.
తరువాత ఇంటికి తిరిగి వచ్చిన శోభారాణి, కొడుకుని అక్కడే వదిలి కూతురితో కోయిలకొండకు బయలుదేరింది. ఈ సమయంలో నర్సింహులు ఆమెను బైక్‌పై తీసుకెళ్లి, చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరుసటి రోజు తెల్లవారుజామున చెట్ల పొదల్లో చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా, రక్తపు మడుగులో శోభారాణి మృతదేహం పడి ఉండగా, పక్కనే చిన్నారి ‘అమ్మా.. అమ్మా..’ అంటూ రోదిస్తూ కనిపించింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నర్సింహులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.



