భద్రాచలం పరిసర 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి – రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తి
The 5 villages surrounding Bhadrachalam must be merged back into Telangana – MP Vaddiraju demands in Rajya Sabha.
భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా అభివృద్ధి చెందాలని తమ పార్టీ ఆకాంక్ష అని తెలిపారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన కొన్ని మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించడం అన్యాయమని పేర్కొన్నారు.
భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాలు ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్నాయని, భద్రాచలం దేవస్థానం భూములలో చాలా భాగం ఈ గ్రామాల పరిధిలోనే ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని కోరారు.
ఇక తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని పేర్కొన్నారు.
అలాగే, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు.
మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలను త్వరగా పూర్తి చేసి సేవలు ప్రారంభించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఖమ్మం–కొత్తగూడెం–భద్రాచలం కారిడార్‌ను నాలుగు లైన్లుగా విస్తరించి రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.



