హై స్కూల్ కంప్యూటర్ టీచర్ల పునర్నియామకంపై ఇరువురు ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి
హైదరాబాద్, (వాయిస్ టుడే):
అఖండ ఆంధ్రప్రదేశ్‌లో 2008 నుంచి 2015 వరకు ప్రభుత్వ హై స్కూల్‌లలో పనిచేసిన కంప్యూటర్ టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కంప్యూటర్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
కర్మాన్ఘాట్ ఎల్బీనగర్ స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన కంప్యూటర్ టీచర్లు గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడంలో వీరి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ వైపు వేగంగా మారుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యత మరింత పెరిగిందని తెలిపారు. ఇలాంటి సమయంలో అనుభవం కలిగిన టీచర్లను తిరిగి నియమిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతో పాటు డిజిటల్ లెర్నింగ్ బలోపేతం అవుతుందని అన్నారు.
అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్పందించి, అఖండ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన హై స్కూల్ కంప్యూటర్ టీచర్లను తక్షణమే పునర్నియమించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శోభ, అబ్రహం, రాంప్రసాద్, జలాన్ తదితరులు పాల్గొన్నారు.



