3,50,000 లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ భద్రాచలం ఎఫ్ డి ఓ, తేగడ ఎఫ్ ఆర్ ఓ
భద్రాద్రి
Bhadrachalam FDO and Tegada FRO Caught by ACB While Accepting a Bribe of ₹3.5 Lakhs
అటవీ శాఖలో మరోసారి అవినీతి బాగోతం బయటపడింది. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన అటవీ శాఖ అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భద్రాచలం అటవీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖ అవినీతి మరోసారి బట్టబయలైంది. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనుల సందర్భంగా కొన్ని అటవీ శాఖ చెట్లు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అయితే… కేసు నమోదు చేయకుండా ఉండాలంటే భారీగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుజాత ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఉచ్చుపన్ని, గురువారం భద్రాచలం కార్యాలయంలో తొలి విడతగా రూ.3 లక్షల 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎఫ్డీఓ సుజాతతో పాటు చర్ల ఇన్చార్జ్ డీఆర్ఓ కృష్ణయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పట్టుబడిన అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.



