కేంద్ర మంత్రి పదవికి ఈటల రాజేందర్ పేరు..? తెలంగాణ బీజేపీలో జోరుగా ప్రచారం
వాయిస్ టుడే :హైదరాబాద్
Etela Rajender’s Name for a Union Cabinet Post? Speculation Rife within Telangana BJP
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారినట్లు చర్చ సాగుతోంది. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై ఊహాగానాల మధ్య తెలంగాణకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశమున్నట్లు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారీగా రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, రాబోయే ఎన్నికల వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కీలక మార్పులు ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు నాయకుల పేర్లు చర్చకు వస్తుండగా, ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి అప్పగించే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ, బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీసీ సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీ విస్తరణ, రాబోయే ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పదవిపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. భగీరథ్ పోక్సో కేసు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ విమర్శలు, ప్రతిపక్ష పార్టీల నిరసనలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలతో బండి సంజయ్‌పై ఒత్తిడి పెరిగినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు సంబంధించి మార్పులు జరిగే అవకాశాలపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ నెల 26తో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా, రాజ్యాంగ పరిమితి ప్రకారం గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండొచ్చన్న ప్రచారం జాతీయ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
గత రెండు పర్యాయాల్లో కూడా మోడీ ప్రభుత్వం క్రమం తప్పకుండా మంత్రివర్గాన్ని విస్తరించిన నేపథ్యంలో, ఈసారి కూడా ప్రాంతీయ, కుల సమతుల్యతతో పాటు ఎన్నికల వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలకు అవకాశం కల్పించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు కీలకంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
—
🖋️ *స్టాఫ్ రిపోర్టర్ | వాయిస్ టుడే న్యూస్*



