పారదర్శకంగా రాజన్న కోడెల పంపిణీ
పక్కదారి పట్టించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
అర్హతలు ఉన్న వారికే 120 జతల జీవాల పంపిణీ
Transparent distribution of ‘Rajanna Kodela’ [scheme benefits]: Whip and MLA Adi Srinivas
రాజన్న సిరిసిల్ల
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల నుంచి అర్హులైన రైతులకు కోడెలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలలో రైతులకు బుధవారం 120 జతల కోడెలను ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కోడెను కట్టే సంస్కృతి ఇక్కడ ఉందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు చెల్లింపు అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు తిప్పాపూర్ గోశాల లో ఉచితంగా స్వామివారి కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెలను దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇతర శాఖల అధికారులతో నిత్యం తనిఖీ చేయిస్తామని స్పష్టం చేశారు. కోడెలను పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గంలోని మర్రిపల్లిలో అధునాతన సౌకర్యాలతో 40 ఎకరాల స్థలం గోశాలకు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే గోశాల పనులకు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. కోడెలను సన్న, చిన్న కారు రైతులకు పంపిణీ చేస్తున్నామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అర్హులైన రైతులకు త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. కోడెలను సంరక్షించి.. వ్యవసాయ పనులకు వినియోగించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆన్లైన్ లో అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకున్న రైతులకు పశువైద్య, ఆలయ, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా కోడెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాజన్న ప్రసాదంగా స్వీకరించి.. కోడెలను రైతులు వ్యవసాయ పనులకే వినియోగించాలని సూచించారు నిరంతరం కోడెలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు కోడెలను తనిఖీ చేస్తామని తెలిపారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, ఆర్డీఓ కె. ఎస్ బి. కుమారి, ఆలయ ఈఓ రమాదేవి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ లోకేష్, వ్యవసాయ, రెవెన్యూ, ఆలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


![Transparent distribution of 'Rajanna Kodela' [scheme benefits]: Whip and MLA Adi Srinivas Transparent distribution of 'Rajanna Kodela' [scheme benefits]: Whip and MLA Adi Srinivas](https://voicetodaynews.com/wp-content/uploads/2026/06/51-2-696x464.jpg)

