ఘనంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
మున్నూరు కాపుల ఐక్యతకు GMA కృషి అభినందనీయం: ఉప్పుల శివ ప్రసాద్
హైదరాబాద్, జూన్ 28 : (వాయిస్ టుడే)




ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, సమాజ ఐక్యత, అభివృద్ధి, విద్యా ప్రగతి, యువత సాధికారత మరియు భవిష్యత్ తరాల పురోగతే లక్ష్యంగా గ్లోబల్ అమెరికా మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ ఫౌండర్ మెంబర్, అమెరికా ప్రవాస భారతీయుడు ఉప్పుల శివ ప్రసాద్ అన్నారు.
తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం (TMKJF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సిరి బ్యాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన GMA మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఉప్పుల శివ ప్రసాద్ మాట్లాడుతూ, అమెరికాలో స్థిరపడిన మున్నూరు కాపు కుటుంబాలకు మాత్రమే కాకుండా భారత్‌లోని మన సమాజానికి చెందిన వారికి కూడా అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్నామని తెలిపారు. వీసా, పాస్‌పోర్ట్, విద్య, ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం విదేశీ అవకాశాలు, వైద్య సహాయం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహకారం వంటి అనేక సేవలను GMA ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అమెరికాలో కొత్తగా అడుగుపెట్టే మున్నూరు కాపు యువతకు మార్గదర్శకత్వం కల్పించడం, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ స్వసమాజం కోసం సేవలందిస్తున్న GMA నాయకత్వం ఆదర్శప్రాయమని కొనియాడారు. మున్నూరు కాపుల ఐక్యత, సామాజిక చైతన్యం, విద్యా అభివృద్ధి కోసం జర్నలిస్టుల ఫోరం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
GMA ఫౌండింగ్ మెంబర్ సాంగని రజనీకాంత్ మాట్లాడుతూ, మున్నూరు కాపు సమాజం ఐక్యతే అభివృద్ధికి మూలాధారమని అన్నారు. దేశ విదేశాల్లో విస్తరించి ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర సహకారం, విద్యా ప్రగతి, యువత అభివృద్ధి కోసం GMA కృషి చేస్తోందని తెలిపారు. భవిష్యత్ తరాలకు బలమైన సామాజిక, విద్యా పునాది నిర్మించేందుకు ప్రతి మున్నూరు కాపు కుటుంబం సంఘ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
GMA అధ్యక్షుడు దామెర వంశీ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర సహకారం, సామాజిక చైతన్యం మరియు యువత అభివృద్ధికి కృషి చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
GMA మహిళా విభాగం అధ్యక్షురాలు తోట గీతా మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మహిళల విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత ద్వారానే సమాజం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.
అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ మాట్లాడుతూ, యువత క్రమశిక్షణ, అంకితభావం మరియు కఠోర శ్రమతో తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, ఉన్నత విద్యతో పాటు మంచి విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని అన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిరంతర అధ్యయనం, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరమని పేర్కొన్నారు.
హైడ్రా ఏసీపీ తోట తిరుమలరావు మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబం తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, విద్యావంతులైన యువతే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దగలరని పేర్కొన్నారు.
వరంగల్ క్రైమ్ ఏసీపీ పాంతాడ సదయ్య మాట్లాడుతూ, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి సేవ చేయాలనే దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మున్నూరు కాపు సమాజం ఐక్యంగా ఉంటే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరింత ప్రగతి సాధించవచ్చని అన్నారు.
డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ మాట్లాడుతూ, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో సమాజం మరింత ప్రగతి సాధించేందుకు సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలోని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో రాణించడం ద్వారా సమాజ అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు.
డాక్టర్ అప్పాల సుధాకర్ మాట్లాడుతూ, మున్నూరు కాపు సమాజం అభివృద్ధికి విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యం మూడు కీలక స్తంభాలని అన్నారు. యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఆధునిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలోని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి దేశ విదేశాల్లో ప్రతిభ చాటాలని, సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేషంగా కృషి చేసిన GMA ప్రతినిధులు ప్రసాద్ ఆకుల మరియు సురేష్ పురం,అన్వేష్ బొల్లం లను పలువురు వక్తలు అభినందించారు. కార్యక్రమ నిర్వహణలో వారి సమన్వయం, సేవాభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, మున్నూరు కాపు సమాజం విద్య, ఉపాధి, వ్యాపారం, రాజకీయ మరియు సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మున్నూరు కాపులు పరస్పర సహకారంతో ముందుకు సాగితే సమాజానికి మరింత గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
తొర్రూరు తహసీల్దార్ అనిల్ కుమార్, వరంగల్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కటకం పెంటయ్య ,కార్పొరేటర్అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ కోరబోయిన సాంబయ్య ,వాసాల వెంకటేశ్వర్లు , చింతల సత్య నారాయణ , వలిశెట్టి సుధాకర్, అడుప సాంబశివరావు, సీహెచ్ సత్యనారాయణ, కోలా కృష్ణ, కొత్త తిరుపతి, తోట సారంగపాణి , యాంసాని శ్రీనివాస్, బక్కి రాజ్‌కుమార్, న్యాయవాది ఎం. లలిత తదితరులు మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి ఐక్యతే మార్గమని పేర్కొన్నారు. యువత విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ మున్నూరు కాపు సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, యువ నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం GMA ప్రతినిధులను తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం సభ్యులు ,మున్నూరు కాపు సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపుల ఐక్యత, విద్యా ప్రగతి, సామాజిక అభ్యున్నతి కోసం దేశ విదేశాల్లోని మున్నూరు కాపులు ఒకే వేదికపైకి వచ్చి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమావేశం ఆత్మీయ వాతావరణంలో కొనసాగి, సమాజ అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.




