జనసేన వైపు ఆశా కిరణ్..?

- Advertisement -

జనసేన వైపు ఆశా కిరణ్..?

జనసేనలో చేరికపై జోరుగా ప్రచారం.. రాజకీయ వర్గాల్లో చర్చ

కాపు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతాలా?

Is Asha Kiran Joining Jana Sena?

విజయవాడ, జూలై 7: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ పేరు ఇప్పటికీ రాజకీయ చర్చల్లో వినిపిస్తూనే ఉంటుంది. కాపు సామాజిక వర్గంలో ఆయనకు ప్రత్యేక ఆదరణ ఉండగా, విజయవాడ కేంద్రంగా అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఇటీవల వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. దీనిపై రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఆయనను కలిసి తన తండ్రి ఆశయాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రంగాభిమానులతో సమావేశాలు నిర్వహించిన ఆశా కిరణ్, వంగవీటి మోహన్ రంగ ఆశయాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో ఆమె జనసేన పార్టీలో చేరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్‌తో జరిగే భేటీలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టడం, రంగా పుష్కర్ ఘాట్ ఏర్పాటు, అలాగే రంగ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించే అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో ఆశా కిరణ్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు, వంగవీటి మోహన్ రంగ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనంతరం ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనకు త్వరలో ఎమ్మెల్సీ పదవి లభించే అవకాశముందన్న ప్రచారం కూడా సాగుతోంది.

కాపు సామాజిక వర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ టీడీపీ–జనసేన కూటమి తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు రాధాకృష్ణకు టీడీపీలో, మరోవైపు ఆశా కిరణ్‌కు జనసేనలో ప్రాధాన్యం కల్పించడం ద్వారా కాపు వర్గంలో మరింత బలం పెంచుకోవాలనే ప్రయత్నం జరుగుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే ఆశా కిరణ్ జనసేనలో చేరుతున్నారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పవన్ కళ్యాణ్‌తో ఆమె భేటీ అనంతరం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular