వదలా’ మూవీ అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ థ్రిల్లర్ : జగపతి బాబు
జగపతి బాబు, లయ, అకెళ్ల వి కృష్ణ, కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ ‘వదలా’ మిస్టరీ గ్రిప్పింగ్ ట్రైలర్ లాంచ్
‘Vadala’ is a family thriller that will connect with everyone: Jagapathi Babu
వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఎమోషన్స్, మిస్టరీ, సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘వదలా’తో సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించిన ఈ చిత్రం, ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్, మంచి ఆదరణ పొందిన టీజర్‌తో ఆసక్తిని పెంచింది. ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రానుంది. తాజాగా చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
యోగి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందంగా జీవిస్తుంటాడు. పెళ్లై ఇరవై ఏళ్లు అయినా భార్యాభర్తల మధ్య ప్రేమ ఏమాత్రం తగ్గదు. అయితే వారి జీవితంలోకి పక్కింటికి వచ్చిన ఓ అమ్మాయి ప్రవేశించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. యోగిపై ఆమెకు తీవ్ర స్థాయిలో వ్యామోహం పెరుగుతుంది. అతడిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇదే సమయంలో యోగి భార్యకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం, భర్తను వదిలేయాలని హెచ్చరించడం కథలో ఉత్కంఠను పెంచుతుంది.
సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను తెరకెక్కించడంలో తనదైన శైలి ఉన్న దర్శకుడు అకెళ్ల వి కృష్ణ ఈ చిత్రంలో కూడా అదే మ్యాజిక్‌ను చూపించినట్లు ట్రైలర్ చెబుతోంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తూ, మిస్టరీతో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలను కూడా కలిపి కథను నడిపించారు.
జగపతి బాబు ఓ కుటుంబానికి అంకితమైన వ్యక్తి పాత్రలో చాలా సహజంగా కనిపించారు. లయ ఆయన భార్యగా ఆకట్టుకునే నటన నబరిచారు. అయితే ట్రైలర్లో అత్యంత ఆశ్చర్యపరిచే పాత్ర హృతిక శ్రీనివాస్ ది. బయటకు అమాయకంగా కనిపిస్తూ, లోపల తీవ్రమైన మనస్తత్వం ఉన్న యువతిగా ఆమె నటన ఆకట్టుకుంటోంది.
సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు తన విజువల్స్‌తో సస్పెన్స్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. కార్తీక్ కోడకండ్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో టెన్షన్‌ను మరింత పెంచింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ట్రైలర్‌ను మరింత ఎంగేజింగ్ నడిపింది. లక్ష్మీ భూపాల కథ అందించగా, బజ్జా బ్రహ్మయ్య ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహించారు. ‘వదలా ’ ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. మిస్టరీ, సస్పెన్స్, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘వదలా’ సినిమా జూలై 17న వదులుతున్నాం. ఈ సినిమా కథ మీద నాకు చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఆడుతుందని నమ్ముతున్నాను. చాలా రోజుల తర్వాత నేను సోలోగా చేసి మొత్తం భారం తీసుకుని, ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని చేసిన ప్రయత్నం ఇది. అందరూ కష్టపడినట్టే మేమూ కష్టపడ్డాం. ‘వదలా ‘ అనేది చాలా క్యాచీ టైటిల్. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి వదలా అని చెబుతారు. కానీ వదలకపోవడమే ఒక కిక్. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి మాకు బిజినెస్ ఇవ్వాలి. మా బాధ్యత అంతా సినిమా బాగా చేసి, ‘వదలా ‘ అనే సినిమా రిలీజ్ చేయడం వరకే. 20 రోజుల క్రితమే ఈ సినిమాను విడుదల చేయాల్సింది. కానీ మరింత మెరుగ్గా మీ ముందుకు తీసుకురావాలని వాయిదా వేశాం. అనుకున్నట్లే సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను నాకు తెలిసి ఎవరూ ట్రోల్ చేయరు. అంత అవకాశం, సమయం ఎవరికీ లేవు. అందువల్ల మేం సేఫ్. నేను ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే… కొన్ని చిత్రాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి సినిమా ఆడకూడదని, వాళ్లు నాశనం కావాలని చేసే విమర్శలు చూస్తుంటే మనమే బాధపడుతున్నాం. అలాంటి ఆలోచనలు వదిలేద్దాం. పాజిటివ్‌గా ఉందాం. ఇది మంచి ఫ్యామిలీ థ్రిల్లర్. అలాగే మంచి డ్రామా కూడా ఉంది. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాల్సి వస్తోంది. ఓటీటీ, హిందీ డబ్బింగ్… ఇలా చాలా విషయాలు చూడాల్సి వస్తోంది. ఎలా తీసినా ప్రేక్షకులను అలరించడమే అంతిమ లక్ష్యం. ఒక సినిమాను ఆరు నెలల్లో తీయొచ్చు. కానీ ఇప్పుడు మూడేళ్లు పడుతోంది. దానికి కచ్చితమైన కారణం ఏమిటంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఒకవేళ సినిమా పూర్తయినా రిలీజ్ డేట్ అనేది ఎవరి చేతిలో ఉండడం లేదు. అన్నిటికంటే ముందు మనం సినిమాను నమ్మి తీయాలి. ‘వదలా ‘ సినిమా వచ్చేసరికి నేను 50 ఏళ్లుగా ఈ ఇండస్ట్రీని వదలా కుండా తిరుగుతున్నాను. అలాగే జగపతిబాబు గారు కూడా వదలా కుండా తిరుగుతున్నారు. (నవ్వుతూ ) మనం ఎప్పుడూ సినిమాను నమ్ముకోవాలి, ప్రేక్షకులను నమ్ముకోవాలి. మిగతావన్నీ మధ్యలో వస్తాయి. మనం నమ్మిన దాని కోసం సినిమా చేయాలి. జగపతిబాబు గారు ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశారు. ఎంతో ప్రేమించి చేశారు. ఈ సినిమా కోసం చాలా తపన పడ్డారు.ఇంతకాలం మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేక్షక దేవుళ్లు మరోసారి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మా బ్యానర్‌పై ఎన్నో సినిమాలు చేశాం. కానీ ఫస్ట్ టైమ్ ఒక థ్రిల్లర్ చేస్తున్నాం. జూలై 17న సినిమా విడుదల అవుతోంది. తప్పకుండా మీరందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.”
హీరోయిన్ లయ మాట్లాడుతూ.. “ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది. ‘వదలా ‘ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. జగపతిబాబు గారితో మళ్లీ కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా దర్శకుడు వంశీకృష్ణ గారికి థాంక్యూ. ఆయన ఈ సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చోటా గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. ఆయన ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. భరద్వాజ గారికి, కిషోర్ గారికి థాంక్యూ సో మచ్. కార్తీక్ అందరికీ నచ్చే పాటలు ఇచ్చారు. ప్రతి పాట కూడా హిట్ అయింది. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా అందరూ థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.”
హృతికా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమా దొరకడం నా అదృష్టం. జగపతిబాబు గారు నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమని అత్తకు కూడా థాంక్స్ చెబుతున్నాను. అందరూ కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇలాంటి మంచి పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉన్న పాత్ర దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లయ గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చోటా గారు చాలా అందంగా ప్రజెంట్ చేశారు. జూలై 17న సినిమా విడుదల అవుతోంది. తప్పకుండా మీరందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.”
దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. నా ఫస్ట్ సినిమా హీరో జగపతిబాబు గారు. ‘రక్ష’ సినిమా నుంచి ఆయనతో నా ప్రయాణం కొనసాగుతోంది. నాలుగేళ్ల క్రితం ఆయన ఈ సినిమా ఐడియా చెప్పారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అంతా జేబీ గారే. ‘వదలా ‘ టైటిల్‌లాగే ఆయన ఏ విషయాన్నీ వదలా కుండా బయటికి తీసుకొచ్చిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ఎంతో ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత అద్భుతంగా బయటకు వచ్చింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. తమ్మారెడ్డి భరద్వాజ్ గారిలో ఒక జెన్-జీ యంగ్ స్టార్ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. చాలా కొత్తగా ఆలోచిస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. డీవోపీ చోటా గారు ఒక అద్భుతం. ఆయన షూటింగ్లో ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. అలాగే కిషోర్ గారు గొప్ప మనిషి. వీళ్లందరూ అద్భుతంగా చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. కార్తీక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మూడు పాటలు కూడా హిట్ అయ్యాయి. సినిమా చాలా బాగా వచ్చింది. లయ గారు అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హృతిక కూడా అద్భుతంగా నటించింది.
ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ధన్యవాదాలు. జూలై 17న సినిమా విడుదల అవుతోంది. మీ అందరి సపోర్ట్‌తో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.”
నిర్మాత కిషోర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి కంటెంట్‌కు ప్రేక్షకులు ఎంతో మంచి ఆదరణ ఇచ్చారు. సినిమా కూడా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాతో పాటు విడుదలవుతున్న మిగతా సినిమాలన్నీ కూడా విజయవంతం కావాలి. పరిశ్రమ బాగుండాలి. థియేటర్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్
వదలా’ మూవీ అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ థ్రిల్లర్ : జగపతి బాబు

- Advertisement -
- Advertisement -



