ముద్రగడ పద్మనాభం మృతి పట్ల కేసీఆర్ సంతాపం..
రాజీలేని ఉద్యమనేతను కోల్పోయాం
KCR condoles the death of Mudragada Padmanabham.
హైదరాబాద్, వాయిస్ టుడే న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ముద్రగడ పద్మనాభం పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా ప్రజాసేవలో విశిష్ట పాత్ర పోషించారని కేసీఆర్ కొనియాడారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపు వర్గాలకు, అనుబంధ కులాలకు అందేలా చేయాలనే లక్ష్యంతో ముద్రగడ పద్మనాభం తన జీవితమంతా రాజీలేని పోరాటం సాగించారని కేసీఆర్ అన్నారు. తాను విశ్వసించిన సిద్ధాంతాల కోసం ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపిన ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం మరణం సామాజిక ఉద్యమాలకు, ముఖ్యంగా కాపు వర్గాల హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటాలకు తీరని లోటని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




