సాఫ్ట్‌వేర్ ఫుల్‌టైం.. సైబర్ క్రైమ్ పార్ట్‌టైం
తక్కువ వడ్డీ రుణాల పేరుతో ఆన్‌లైన్ మోసాలు – సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్
Full-time software professional… part-time cybercriminal.
ఆదిలాబాద్, జూలై 18 (వాయిస్ టుడే): తక్కువ వడ్డీకి ఆన్‌లైన్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న సైబర్ ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తలారి ఆకాష్‌ను అరెస్ట్ చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా “తక్కువ వడ్డీకే ఆన్‌లైన్ లోన్” అనే ప్రకటనను క్లిక్ చేశాడు. అనంతరం సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించి ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్ ఫీజు, ఈఎంఐ, సర్వీస్ చార్జీల పేర్లతో విడతల వారీగా రూ.17,951 వసూలు చేశారు.
అయితే డబ్బులు చెల్లించినప్పటికీ రుణం మంజూరు కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రవీణ్ ఆదిలాబాద్ రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇదే తరహాలో మరో 30 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. విచారణలో హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తలారి ఆకాష్‌తో పాటు మరో నలుగురు ఈ మోసాల్లో పాల్గొన్నట్లు తేలింది.
ప్రధాన నిందితుడు తలారి ఆకాష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
ప్రజలకు పోలీసుల సూచన: సోషల్ మీడియాలో కనిపించే తక్కువ వడ్డీ రుణాల ప్రకటనలను నమ్మవద్దని, ప్రాసెసింగ్ ఫీజు లేదా ఇతర చార్జీల పేరుతో ముందస్తుగా డబ్బులు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.




