“నేను సైతం” కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్‌ సైబరాబాద్ సీపీ సమీక్ష

- Advertisement -

 “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్‌
సైబరాబాద్ సీపీ సమీక్ష

Geo-tagging of CCTV cameras as part of the “Nenu Saitham” program
Cyberabad CP reviews the initiative

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్, పర్యవేక్షణ, నిర్వహణ, విస్తరణపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, అధ్యక్షతన బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, నేరాల దర్యాప్తు, కీలక సమాచార సేకరణలో సీసీటీవీ కెమెరాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేసి వాటి వివరాలను డిజిటల్ డేటాబేస్‌లో నమోదు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే ప్రతి కెమెరాను కూడా వెంటనే జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు.

ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ వ్యవస్థ పర్యవేక్షణ కోసం ప్రత్యేక అడ్మిన్‌ను నియమించి, కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచించారు. పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించి, ఇప్పటికే ఉన్న కెమెరాలను పోలీసు పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానం చేయాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో “నేను సైతం” కార్యక్రమం ద్వారా మరిన్ని సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా, చాలా చోట్ల మరుగున పడిన డీవీఆర్ (DVR) ఆధారిత సీసీటీవీ వ్యవస్థలను ఆధునిక ఎన్‌వీఆర్ (NVR) సాంకేతికతకు అప్‌గ్రేడ్ చేసే అంశంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. కమిషనరేట్ వ్యాప్తంగా డీవీఆర్ వ్యవస్థలను దశలవారీగా ఎన్‌వీఆర్ విధానానికి మార్చేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన, పోలీస్ స్టేషన్ల నుంచి ప్రధాన కంట్రోల్ సెంటర్ వరకు నెట్‌వర్క్ అనుసంధాన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలోని సీసీటీవీ నెట్‌వర్క్‌ను సెంట్రల్ కంట్రోల్ వ్యవస్థతో అనుసంధానం చేయడం ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, వీడియో రికార్డింగ్, ఫుటేజీ నిల్వ, అవసరమైన సమయంలో ఆధారాల సేకరణ, విశ్లేషణ మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు.

సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన వెండర్లు కెమెరాల నిర్వహణ, సాంకేతిక లోపాల పరిష్కారం, సేవల నిరంతర అందుబాటుపై పూర్తి బాధ్యత వహించాలని సీపీ స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్ ప్రక్రియ, సాఫ్ట్‌వేర్ వినియోగం, కెమెరాల నిర్వహణపై అధికారులు, సిబ్బంది, వెండర్లకు ప్రత్యేక శిక్షణ, ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించాలని సూచించారు.

సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు, నేరాల దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచి ప్రజలకు మరింత మెరుగైన భద్రతను అందించవచ్చని డా. ఎం. రమేష్ తెలిపారు. సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్, సెంట్రల్ మానిటరింగ్, డీవీఆర్ నుంచి ఎన్‌వీఆర్ వ్యవస్థకు మార్పు ద్వారా నేరాలపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని, తద్వారా నేరాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో “నేను సైతం” కార్యక్రమాన్ని మరింత విస్తరించి, నివాస గృహాలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థల్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులతో అనుసంధానం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతికత కలిసివస్తే సైబరాబాద్ కమిషనరేట్‌ను మరింత సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని కమిషనర్ పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular