రేషన్ బియ్యం పంపిణీ సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టుంది: ఈటల రాజేందర్

- Advertisement -

రేషన్ బియ్యం పంపిణీ సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టుంది: ఈటల రాజేందర్

The situation regarding the distribution of ration rice is a case of “one person paying the bill while another takes the credit”: Etela Rajender.

రేషన్‌ కార్డులపై ఫొటోలు లేకుండా పంపిణీ చేయాలి

లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో కూడా పెట్టాలి

బియ్యానికి ఎక్కువ నిధులు ఇస్తోంది కేంద్రమే: ఎంపీ ఈటల

హైదరాబాద్, ఆగస్టు 14: రేషన్‌ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ముద్రించడాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న ఆహార భద్రతా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తన నేతల ఫొటోలు పెట్టడం సరికాదని ఆయన విమర్శించారు. రేషన్‌ కార్డులపై ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా ‘భారత ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో’ అని మాత్రమే పేర్కొంటూ కార్డులు జారీ చేయాలని సూచించారు.

“రేషన్‌ బియ్యం పంపిణీ సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టుగా ఉంది. కార్డులపై ఫొటోలు లేకుండా ఇవ్వాలి. లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో కూడా పెట్టాలి. రేషన్‌ బియ్యానికి ఎక్కువ నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే” అని ఈటల రాజేందర్‌ అన్నారు.

1.91 కోట్ల మందికి కేంద్రం ద్వారా బియ్యం

జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద దేశవ్యాప్తంగా బీపీఎల్‌ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రేషన్‌ బియ్యం అందిస్తోందని ఈటల తెలిపారు. తెలంగాణలో సుమారు 57 లక్షల రేషన్‌ కార్డుల పరిధిలో 1.91 కోట్ల మందికి కేంద్రం 9.55 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందిస్తోందని పేర్కొన్నారు.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో 49.4 లక్షల రేషన్‌ కార్డులకు చెందిన సుమారు 1.50 కోట్ల మందికి 9 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రం కంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మంది లబ్ధిదారులకు బియ్యం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

రూ.600 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు

కొత్త రేషన్‌ కార్డుల ముద్రణ, పంపిణీ కోసం సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఈటల ప్రశ్నించారు.

“ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ రేషన్‌ కార్డులు శాశ్వతంగా ఉండాలి. ఇప్పుడు కార్డులు లేకపోయినా బియ్యం పంపిణీ జరుగుతోంది. అలాంటప్పుడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త కార్డులు ఎందుకు ఇస్తున్నారు? మీ ఫొటోలు పెట్టుకోవడం కోసమేనా?” అని ఆయన ప్రశ్నించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై విమర్శలు

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని తీసుకోకుండా వ్యవహరించిందని ఈటల ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర నిధులను తీసుకుంటున్నప్పటికీ పథకాలకు ఇందిరమ్మ పేరు, ఫొటో మాత్రమే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

“ఒకవైపు నిధుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారు.. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు. కానీ కేంద్రం సహకారం ఉందని మాత్రం బయటకు చెప్పడం లేదు” అని అన్నారు.

తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో చర్చలు

బీజేపీ తెలంగాణ ఎంపీలుగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసి వినతులు అందించినట్లు ఈటల తెలిపారు. జవహర్‌నగర్‌ డంప్‌యార్డు, హైదరాబాద్‌ మెట్రో, జాతీయ రహదారులు, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (RRR) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

రైల్వే మంత్రిని కలిసి రైలు పట్టాల వద్ద ప్రమాదాల నివారణకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు (FOB), రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు (ROB), రోడ్‌ అండర్‌ బ్రిడ్జిలు (RUB) సంఖ్యను పెంచాలని కోరినట్లు తెలిపారు. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, దేశవ్యాప్తంగా కూడా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular