ఎనిమిది దశాబ్దాలైనా ఆశించిన అభివృద్ధి జరగలేదు: కేటీఆర్

- Advertisement -

ఎనిమిది దశాబ్దాలైనా ఆశించిన అభివృద్ధి జరగలేదు: కేటీఆర్

The expected development has not taken place even after eight decades: KTR

తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ.. పార్టీ శ్రేణులతో సమావేశం

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తయినా దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భాషలు, సంస్కృతులు వేరైనా భారతీయత అనే భావన దేశ ప్రజలందరినీ ఏకం చేస్తోందన్నారు. స్వాతంత్య్రం సాధించిన అనంతరం దేశం బాగుపడాలని నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఆకాంక్షించారని, అయితే ఎనిమిది దశాబ్దాలు గడిచినా వారి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

దేశంలో ఇప్పటికీ రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, పాఠశాల సౌకర్యాలు లేని గ్రామాలు ఉండటం బాధాకరమన్నారు. సాగునీటి సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న జల వనరులను సమర్థంగా వినియోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు.

చైనా గత నాలుగు దశాబ్దాల్లో సాధించిన అభివృద్ధి మన కళ్లముందే ఉందని కేటీఆర్‌ అన్నారు. భారత్‌కు కూడా అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకునే సమర్థవంతమైన పాలన అవసరమన్నారు. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలంటే మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, అలాంటి వ్యక్తికి తెలంగాణ అభివృద్ధిపై ఏ మేరకు చిత్తశుద్ధి ఉంటుందని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి అంశంలో కౌంటర్‌ దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వానికి సమయం లేదా అని ప్రశ్నించారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా అందించామని కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరంలోనూ విద్యుత్‌ సరఫరా పరిస్థితి సరిగా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ గురించి మాట్లాడుతోందని, అయితే బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సింగిల్‌ ఇంజన్‌తోనే వేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెబుతున్నారని, ఆ శ్రమ ఎవరి ప్రయోజనాల కోసం అన్నది ప్రజలు ఆలోచించాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ దివాళా తీసిందంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.

జిల్లాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ

రానున్న రోజుల్లో జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. ప్రతిరోజూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తామని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రస్థానం కొండా లక్ష్మణ్‌ బాపూజీ అందించిన జలదృశ్యం నుంచే ప్రారంభమైందని కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ భవన్‌ నిర్మించి 20 ఏళ్లు పూర్తయిందని, తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఆలోచన మేరకు ఈ భవనం నిర్మించారని తెలిపారు.

తెలంగాణ భవన్‌ తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్న కేటీఆర్‌, భవన నిర్మాణంలో శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. జాతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular