టిపిసిసి క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ
Minister Konda Surekha submits explanation to TPCC Disciplinary Committee.
హైదరాబాద్: టిపిసిసి క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు సంబంధించి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం తన వివరణను లేఖ రూపంలో కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. నోటీసులో పేర్కొన్న అంశాలపై తన వైఖరిని మంత్రి లేఖలో స్పష్టం చేశారు.
ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారని మంత్రి తెలిపారు.
తన స్వస్థలమైన గీసుకొండతో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు.
ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు అని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాల్సి రావడం సముచితం కాదని పేర్కొన్నారు.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని కోరారు.
ఈ నేపథ్యంలో తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని టిపిసిసి క్రమశిక్షణా కమిటీని మంత్రి కొండా సురేఖ గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.




