కొండా సురేఖకు ఢిల్లీ పిలుపు
Konda Surekha summoned to Delhi
మంత్రి పదవి కోల్పోయిన మరుసటి రోజే రంగంలోకి కాంగ్రెస్ అధిష్ఠానం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (వాయిస్ టుడే): మంత్రి పదవి నుంచి తొలగించిన కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపునిచ్చినట్లు సమాచారం. వెంటనే ఢిల్లీకి బయలుదేరి రావాలని పార్టీ పెద్దల నుంచి సందేశం అందినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి పదవి నుంచి తొలగించిన మరుసటి రోజే అధిష్ఠానం ఆమెతో సంప్రదింపులు జరపడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని, అధిష్ఠానం అండగా ఉంటుందని ఆమెకు హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో కొండా సురేఖను బుజ్జగించేందుకు అధిష్ఠానం చర్యలు చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమెకు కేబినెట్ హోదా కలిగిన పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది.
అధిష్ఠానం పిలుపు మేరకు కొండా సురేఖ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో, ఆమెతో పార్టీ పెద్దల చర్చల అనంతరం తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.




