8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభించిన: మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

  8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభించిన: మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar inaugurates massive centralized community kitchen costing ₹8 crore.

కరీంనగర్

కరీంనగర్  పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఉదయం ఆకలితో తరగతి గదులకు రాకుండా.. వారికి నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి ఆకలిని తరిమి అక్షరానికి అండగా నిలవడమే స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
కరీంనగర్ మార్కెట్‌యార్డులో తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా కలిసి సుమారు రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలను పరిశీలించారు.
విద్యే పిల్లలకు గొప్ప ఆస్తి
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. గతంలో విద్యార్థుల ఎదుగుదలకు భూములు, నిధులు వంటి ఆస్తులు ఉండేవని, ఇప్పుడు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనని అన్నారు. ఇటీవల జరిగిన సిప్ సర్వేలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలను పరిశీలించినప్పుడు ఉన్నత చదువులు చదివిన కుటుంబాలే మెరుగైన స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతున్నామని, ఇప్పుడు విద్యార్థులకు ఉదయమే నాణ్యమైన అల్పాహారం అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆకలితో చదువుకు ఆటంకం ఉండొద్దు:
ఆకలితో ఉన్న పిల్లవాడు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేడని మంత్రి అన్నారు. విద్యార్థులకు ఉదయమే పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఏకాగ్రత, జ్ఞానాత్మక సామర్థ్యం, తరగతి గది భాగస్వామ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల హాజరు, సమయపాలన, విద్యా పనితీరు మెరుగుపడేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా ఉదయమే ఉపాధి కోసం వెళ్లే తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ఆర్థికంగా, సమయపరంగా ఉపశమనం కల్పిస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు వంట, ఆహార నిర్వహణ బాధ్యతల నుంచి విముక్తి పొంది బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
కరీంనగర్‌లో 49,025 మందికి అల్పాహారం:
కరీంనగర్‌లో సుమారు రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌కు రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. 17 మండలాల్లోని 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ బ్రేక్‌ఫాస్ట్ సేవలు అందుతాయని చెప్పారు. మొత్తం 49,025 మంది విద్యార్థులు ప్రతిరోజూ ప్రయోజనం పొందుతారని వివరించారు. కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల విద్యార్థులకు ఈ కిచెన్ ద్వారా అల్పాహారం అందుతుందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా హుస్నాబాద్‌లో 16,544 మంది, మానకొండూర్‌లో 8,645 మంది, చొప్పదండిలో 7,481 మంది, కరీంనగర్‌లో 16,355 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని చెప్పారు. రాష్ట్రంలో ఇది ఆరవ కమ్యూనిటీ కిచెన్ అని మంత్రి తెలిపారు. ఇక్కడి నుంచి 17 మండలాల్లో దాదాపు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం పంపిణీ జరుగుతుందని చెప్పారు.
అధునాతన యంత్రాలతో ఆహార తయారీ:
కిచెన్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, సాంబార్ తయారు చేసే మిషన్లు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. పాత్రలు శుభ్రం చేసే మిషన్లు, పాల కేంద్రం, ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్, కూరగాయలు కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు, చట్నీ పౌడర్ తయారీ మిషన్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. వాటి పనితీరును స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular