జై బోలో గణేష్ మహారాజ్ కీ జై!
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్

ఖైరతాబాద్ గణేష్ అంటే మన తెలంగాణలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గణపతి ఉత్సవం. బడా గణేష్ అంటే ఖైరతాబాద్.. ఖైరతాబాద్ అంటే బడా గణేష్. బడా గణేష్ మాత్రమే కాదు.. బడియా గణేష్ కూడా. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట ఎంత ప్రత్యేకమో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో ఖైరతాబాద్ బడా గణేష్ కూడా అంతే ప్రత్యేకమైన భాగమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
గురువారం అయన ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారు. హరీష్ రావు మాట్లాడుతూ ఈ బడా గణేష్‌ను దర్శించుకోవడానికి తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇంతటి ఘనమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకట మహాగణపతిని ప్రతిష్ఠించడం విశేషం. అంతేకాదు, మట్టితో గణపతిని తయారు చేసి పూజించడం పర్యావరణ పరిరక్షణకు చక్కటి సందేశం. భక్తి శ్రద్ధలతో మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.
ఈ పంచముఖ సంకట మహాగణపతి, పంచముఖ హనుమంతుడు ప్రజలందరినీ దీవించాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల నిర్వాహకులకు ఒక విజ్ఞప్తి. ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహిస్తున్నామో.. నిమజ్జన కార్యక్రమాల్లో అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిన్న పటాన్చెరులో నిమజ్జనం సందర్భంగా జరిగిన అనుకోని ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రజలందరూ సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.




