ప్రజలే పాలనకు కేంద్రం: రేవంత్‌రెడ్డి

- Advertisement -

ప్రజలే పాలనకు కేంద్రం: రేవంత్‌రెడ్డి

ప్రజల సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం.. చరిత్ర స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ నిర్మాణం

People are the core of governance: Revanth Reddy

People are the core of governance: Revanth Reddy
People are the core of governance: Revanth Reddy

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (వాయిస్‌ టుడే):

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రజా పాలనకు పునాదులు

పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ నిర్మాణం: సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (వాయిస్‌ టుడే):
తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు నివాళులర్పించారు.

అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ప్రజా పాలనకు పునాదులని రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17 చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు ప్రజల పట్ల తమ బాధ్యతను గుర్తుచేసే రోజని పేర్కొన్నారు. పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకోవాలని అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

రైతు కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సీఎం తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, రైతుభరోసా కింద నిధులు అందించామని చెప్పారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందన్నారు. భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సంస్కరణలు చేపట్టామని పేర్కొన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం చేస్తున్నామని, పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మహిళలకు ఆర్థిక స్వావలంబన

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్‌, రూ.500కే వంటగ్యాస్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు, వడ్డీ రాయితీలు కల్పిస్తూ మహిళల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

సామాజిక న్యాయానికి పెద్దపీట

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై కుల సర్వే నిర్వహించి, దాని ఆధారంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేశామని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అంటే వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడమేనని అన్నారు.

పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, అర్హులైన వారికి ఇళ్ల మంజూరు కొనసాగుతోందని తెలిపారు. ఆహార భద్రత, సామాజిక భద్రతలో భాగంగా రేషన్‌ కార్డులు, పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

విద్య, వైద్యం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగిస్తున్నామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, కొత్త ఆసుపత్రులు, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలు

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపట్టామని, నైపుణ్యాభివృద్ధికి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

మౌలిక వసతులు.. ఫ్యూచర్‌ సిటీ

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, విమానాశ్రయాల అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టామని చెప్పారు. హైదరాబాద్‌ పరిధిలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు.

భారత్‌ ఫ్యూచర్‌ సిటీని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తామని, ఏఐ, లైఫ్‌ సైన్సెస్‌, విద్య, ఆరోగ్యం, ఈవీ వంటి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారు.

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

ప్రస్తుత అవసరాలు తీర్చడంతో పాటు భవిష్యత్‌ తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేయాలని, నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ఈ లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల సహకారం అవసరమని కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular