28 నుంచి ‘థాయ్‌మామన్ తంగ మోదిరం’
చెన్నై, సెప్టెంబర్ 22:
‘Menamama Bangaru Ungaram’ (Thaimaman Thanga Modiram) from the 28th.
తమిళనాడులో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు టీవీకే ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకూ ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారు ఉంగరం అందించే ‘మేనమామ బంగారు ఉంగరం’ (థాయ్‌మామన్ తంగ మోదిరం) పథకాన్ని ఈ నెల 28న సీఎం విజయ్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ఏడాది జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ప్రతి శిశువుకూ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. తొలి విడతలో భాగంగా పంపిణీ చేసేందుకు ఇప్పటికే 1.28 లక్షల బంగారు ఉంగరాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం.
అయితే ఉప ఎన్నికలు జరగనున్న మదురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళి అమల్లో ఉండటంతో పథకం ప్రారంభంపై ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. ఉచిత అల్పాహార పథకం విస్తరణకు మాత్రమే అనుమతి ఇచ్చామని, బంగారు ఉంగరం పథకానికి అనుమతి ఇవ్వలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడులో ఏడాదికి సుమారు 7.8 లక్షల జననాలు నమోదవుతుండగా.. అందులో దాదాపు 4.2 లక్షల మంది శిశువులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జన్మిస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పిల్లలందరికీ బంగారు ఉంగరం అందించనున్నారు.
ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.




