చలో లోక్‌భవన్ ముట్టడి ఉద్రిక్తత
ఓటర్ల సవరణలో అక్రమాలను నిరసిస్తూ కాంగ్రెస్ భారీ ఆందోళన
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామాకు డిమాండ్
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రుల అరెస్ట్
Tension during the ‘Chalo Lok Bhavan’ siege

హైదరాబాద్, అక్టోబర్ 8: ఓటర్ల సవరణ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘చలో లోక్‌భవన్’ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం లోక్‌భవన్ వద్ద నిరసనకు దిగిన మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన ప్రక్రియను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం అప్రజాస్వామిక చర్యగా ఆయన అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పరిణామాలకు బాధ్యత వహించి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
లోక్‌భవన్ వద్ద నిరసన చేపట్టిన తమను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆయన తెలిపారు. అరెస్టులతో ప్రజల గొంతును అణచివేయలేరని అన్నారు.
ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల అసలైన బలమని, ఆ హక్కును కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.




