ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు
బాహుబలి నుంచి కల్కి వరకు.. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి చేర్చిన రెబల్ స్టార్
Happy birthday to India’s biggest superstar, Prabhas.
హైదరాబాద్, అక్టోబరు 23 (వాయిస్ టుడే):
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘బాహుబలి’తో భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్, నేడు పాన్ ఇండియా సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన అగ్ర కథానాయకుడిగా ఎదిగారు.
‘ఈశ్వర్’ సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్, ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ చిత్రాలతో తన స్టార్‌డమ్‌ను మరింత విస్తరించారు. ముఖ్యంగా ‘బాహుబలి 2’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన అరుదైన ఘనత ఆయన సొంతం.
తెలుగు చిత్రసీమ నుంచి మొదలైన ప్రభాస్ ప్రయాణం బాలీవుడ్‌తో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలను దాటి అంతర్జాతీయ మార్కెట్ల వరకు విస్తరించింది. అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లోనూ ఆయన సినిమాలకు విశేష ఆదరణ లభిస్తోంది. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ రంగాల్లోనూ ప్రభాస్ చిత్రాలకు భారీ డిమాండ్ కొనసాగుతోంది.
నటుడిగా భారీ విజయాలు సాధిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా నిరాడంబరత, ఆప్యాయతతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందుకే అభిమానులు ఆయనను ప్రేమగా ‘డార్లింగ్’ అని పిలుచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం, సామాజిక అవగాహన కార్యక్రమాలకు మద్దతు తెలపడం ద్వారా తన మంచి మనసును చాటుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’, ‘సలార్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, హను రాఘవపూడి రూపొందిస్తున్న ‘ఫౌజీ’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2’, ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ‘సలార్ 2’ చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రతి సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తూ, తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరెన్నో విజయాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. డార్లింగ్స్ గర్వపడేలా మరిన్ని అద్భుతమైన చిత్రాలతో అలరించాలని కోరుకుంటూ.. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్‌కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.




