దక్షిణ భారతదేశాన్ని అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి
రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయం అవసరం – సీఎం రేవంత్ రెడ్డి
South India must be transformed into a safe region: CM Revanth Reddy
హైదరాబాద్, అక్టోబర్ 23 (వాయిస్ టుడే):
దక్షిణ భారతదేశాన్ని దేశంలోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణకు రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. పోలీసింగ్‌లో తెలంగాణ అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వ్యవస్థను పొరుగు రాష్ట్రాలతో పంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ (SRPCC) సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక్కో రాష్ట్రం తన సొంత వనరులతో మాత్రమే నేరాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని, అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు.
తెలంగాణలో పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు నేరాల స్వభావానికి అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కమిషనరేట్లుగా విభజించడం ద్వారా శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. హైడ్రా, ఈగల్, టీజీ-సేఫ్, టీజీ టీమార్స్ వంటి ప్రత్యేక విభాగాలు తమ పరిధిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడం, వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేర బాధితులకు కోల్పోయిన సొమ్మును తిరిగి అందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మంచి ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ విభాగం పనితీరుకు కేంద్ర ప్రభుత్వం 80 శాతానికి పైగా మార్కులు ఇచ్చిందని వెల్లడించారు.
ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణను బలోపేతం చేయడం కోసం అమెరికాలోని ఎఫ్‌డీఏ తరహాలో టీజీ-సేఫ్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెరువులు, జలవనరుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ, ప్రజా ఆస్తుల రక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం ద్వారా తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. పోలీసు కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు హైదరాబాద్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశామని, హోంగార్డు నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల సిబ్బంది పిల్లలకు ఇందులో చదువుకునే అవకాశం కల్పించామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు వారి హోదా, సర్వీసును బట్టి రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా, ఇంటి స్థలం, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
పోలీసు వ్యవస్థ ప్రజలకు భద్రత, నిస్పాక్షికత, నైతిక విలువలతో కూడిన సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు. పోలీసు శాఖకు ప్రభుత్వం కేటాయించే నిధులను ఖర్చుగా కాకుండా పౌరుల భద్రత, మెరుగైన సమాజ నిర్మాణానికి పెట్టుబడిగా భావిస్తున్నానని అన్నారు. మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసింగ్‌లో నిరంతర సంస్కరణలు చేపట్టాలని సూచించారు.
ఈ సదస్సులో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, కర్ణాటక డీజీపీ ఎంఏ సలీమ్, తమిళనాడు డీజీపీ మహేష్ అగర్వాల్, పుదుచ్చేరి డీజీపీ షాలిని సింగ్, లక్షద్వీప్ ఏడీజీ బి. శంకర్ జైస్వాల్, కేరళ ఐజీ అజీతా బేగం, ఆంధ్రప్రదేశ్ ఐజీ రవికృష్ణతో పాటు తెలంగాణకు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




