కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయి
Minister Ponnam expresses shock over the death of conductor Pravalika
అదిలాబాద్, నవంబర్ 4: మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు.
ప్రవళికకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స అందించామని మంత్రి తెలిపారు. ఆమె కోలుకుని తిరిగి విధుల్లో చేరుతుందని ఆశించామని, ఇంతలోనే మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
అక్టోబర్ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో బాలుడి టికెట్, చిల్లర విషయంలో ప్రయాణికురాలికి, కండక్టర్ ప్రవళికకు మధ్య వివాదం తలెత్తింది. మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు బస్సు దిగేందుకు ప్రయత్నించిన సమయంలో చోటుచేసుకున్న తోపులాటలో ప్రవళిక కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సంబంధిత ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య వెల్లడించారు. ప్రవళిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.




