మున్నూరుకాపుల ఐక్యతే అసలైన బలం : ఎంపీ వద్దిరాజు

- Advertisement -

మున్నూరుకాపుల ఐక్యతే అసలైన బలం

The unity of the Munnuru Kapus is their true strength.

The unity of the Munnuru Kapus is their true strength.
The unity of the Munnuru Kapus is their true strength.

ఐకమత్యంతో ముందుకు సాగితే పదవులు వాటంతటవే వస్తాయి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

చెరుకూరి వారి తోటలో వైభవంగా వన సమారాధన మహోత్సవ

మున్నూరుకాపుల ఐక్యత చాటిన వన సమారాధన మహోత్సవం

వేలాదిగా తరలివచ్చిన కులబాంధవులు.. ఐక్యత, రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రముఖుల పిలుపు

ఖమ్మం, నవంబర్ 15: మున్నూరుకాపులంతా వ్యక్తిగత విభేదాలు, అంతర్గత కలహాలను పక్కనపెట్టి ఐకమత్యంతో ముందుకు సాగితే రాజకీయ, సామాజిక రంగాల్లో పదవులు, అవకాశాలు వాటంతటవే వస్తాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మనలో మనం విడిపోయి కలహించుకుంటే సమాజానికి రావాల్సిన అవకాశాలను మనమే దూరం చేసుకున్నట్లవుతుందని హెచ్చరించారు. కుల ఐక్యత, సేవాభావం, విద్య, కష్టపడే తత్వం, పట్టుదలతో సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం వన సమారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మి, పెద్దన్న వద్దిరాజు కిషన్‌తో కలిసి హాజరయ్యారు. ఆయనకు మున్నూరుకాపు బాంధవులు బాణసంచా కాల్చి, పూలవర్షం కురిపిస్తూ, జై మున్నూరుకాపు, మున్నూరుకాపుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలతో ఘన స్వాగతం పలికారు.

వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ వనదేవత, ఉసిరి చెట్టు, పరమశివుడు, గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహోత్సవాన్ని ప్రారంభించారు. కార్తీక మాస ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా పూజా కార్యక్రమాలు సాగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాదిగా తరలివచ్చిన మున్నూరుకాపులు కుటుంబ సమేతంగా పాల్గొనడంతో తోట ప్రాంగణం జనసందోహంతో కళకళలాడింది. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను చాటేలా కార్యక్రమం కొనసాగింది.

సేవ, త్యాగం, ఐక్యతతోనే సమాజానికి గుర్తింపు

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కుల సంఘాల్లో పదవులు ఉంటేనే రాజకీయంగా ఎదగగలమని భావించడం సరైన ఆలోచన కాదన్నారు. సేవాభావం, కష్టపడే తత్వం, పట్టుదల, పరిణతి, ప్రజలతో మమేకమయ్యే గుణం ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వీ. హనుమంతరావు, గంగుల కమలాకర్, జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు ప్రజా జీవితంలో ఎదిగే క్రమంలో కుల సంఘాల్లో ప్రత్యేక పదవులు కలిగి ఉండలేదని గుర్తుచేశారు.

త్యాగం అంటే ఆస్తులు కూడబెట్టుకోవడం కాదని, కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునివ్వడమే నిజమైన త్యాగమని వివరించారు. సమాజం కోసం పనిచేసే వారికే ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. గతంలో పటేల్, పట్వారీలుగా సమాజానికి సేవలందించిన మున్నూరుకాపులు ఇతరులపై ఆధారపడకుండా, పది మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.

ప్రస్తుత రాకెట్, స్పీడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మున్నూరుకాపు యువత ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, సింగపూర్ తదితర దేశాల్లో యువత ఉన్నత స్థానాల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు. యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని, క్రీడారంగంలోనూ మంచి భవిష్యత్తు ఉందని విద్యార్థులకు సూచించారు.

కోకాపేట ఆత్మగౌరవ భవనాన్ని ఐక్యంగా నిర్మించుకుందాం

కోకాపేటలోని మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవనానికి సంబంధించిన భూములు, నిర్మాణ వ్యవహారాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనలు సమంజసం కాదని వద్దిరాజు అన్నారు. ఆత్మగౌరవ భవనం అనేది ఒక వ్యక్తికి లేదా కొందరికే సంబంధించిన అంశం కాదని, మొత్తం సమాజానికి గర్వకారణంగా నిలవాల్సిన ఆస్తి అని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతో, సమష్టి కృషితో భవనాన్ని గొప్పగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర కేబినెట్‌లో మున్నూరుకాపు నాయకుడికి ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే ముందుగా సంఘంలో ఐక్యత ఉండాలని అన్నారు. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లేందుకు తనకు ఎలాంటి భేషజాలు లేవని, సమాజ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

మున్నూరుకాపు యువతకు మార్గదర్శనం చేయడం, విద్యార్థులను ప్రోత్సహించడం, మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు సంఘం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తన కుమార్తె డాక్టర్ గంగాభవాని మహిళల్లో క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పిస్తూ ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వచ్చే నెలలో కొత్తగూడెంలో రాజ్యసభ సభ్యుడు పార్థసారథి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బీసీల హక్కుల సాధనకు ఐక్య పోరాటం అవసరం: వీహెచ్

ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి వీ. హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీలంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని అన్నారు. జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం బాధాకరమని పేర్కొన్నారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కులాల మధ్య విభేదాలు పెంచకుండా అన్ని బీసీ వర్గాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.

జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి: గంగుల

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మున్నూరుకాపుల జనాభాను ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించారనే ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా, సామాజిక బలం ఆధారంగా రావాల్సిన రాజకీయ అవకాశాలు దక్కాలంటే సంఘం ఐక్యంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మున్నూరుకాపుల సభ నిర్వహించి, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మరింత మంది మున్నూరుకాపు నాయకులను చట్టసభలకు పంపే దిశగా ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. వన సమారాధన వంటి కార్యక్రమాలు కేవలం కలుసుకునే వేదికలుగా కాకుండా సమాజ ఐక్యతకు, భవిష్యత్ కార్యాచరణకు దోహదపడాలని అన్నారు. మున్నూరుకాపులు ఆత్మగౌరవం, కష్టపడే తత్వం, సేవాభావం కలిగినవారని పేర్కొన్నారు. సంఘటితంగా ముందుకు సాగుతూ రాజకీయ, సామాజిక రంగాల్లో తమ శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ మాజీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. తమ కులం పేరు చెప్పుకోవడానికి ఎవరూ వెనుకాడాల్సిన అవసరం లేదన్నారు. గర్వంగా తాము మున్నూరుకాపులమని చెప్పుకోవాలని సూచించారు. తనను చాలామంది రెడ్డిగా సంబోధించినప్పటికీ తాను మున్నూరుకాపు బిడ్డనని స్పష్టంగా చెబుతానని వివరించారు. కుల గుర్తింపు పట్ల ఆత్మగౌరవం ఉండాలని, అదే సమయంలో ఇతర వర్గాల పట్ల గౌరవంతో వ్యవహరించాలని అన్నారు.

మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. భావితరాలకు అన్ని రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలంటే ప్రస్తుత తరం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కుల బాంధవులంతా పరస్పర సహకారంతో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో యువతను ప్రోత్సహించాలని కోరారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. కాపులు, మున్నూరుకాపులు అన్నదమ్ముల్లా సఖ్యతతో కలిసి పనిచేయాలని, సామాజిక ఐక్యతతో రాజకీయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

దివంగత ప్రముఖులకు నివాళులు.. అతిథులకు ఘన సత్కారం

సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ స్వాగతం పలికి కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించగా, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షత వహించారు. మున్నూరుకాపు సమాజానికి విశేష సేవలందించిన దివంగత ప్రముఖులు పుంజాల శివశంకర్, మేకల సంగయ్య, రాపర్తి రంగారావు, మలిశెట్టి వరదయ్య, కనకం సత్యనారాయణ చిత్రపటాలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆకుల గాంధీ, పారా నాగేశ్వరరావు, శీలంశెట్టి వీరభద్రం తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజానికి సేవలందించిన వారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

మహోత్సవానికి హాజరైన ప్రముఖులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్, కోశాధికారి కంచి సత్యనారాయణ, ఆకుల రాజయ్య, ఎడవల్లి కృష్ణ, కొడిమ్యాల మధుసూదన్, మరిశెట్టి రాఘవయ్య, గాలి అనిల్ కుమార్, తూడి ప్రవీణ్ కుమార్, రౌతు కనకయ్య, ఎర్రా నాగేంద్రబాబు, పగడాల మంజుల తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి

వన సమారాధనలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. యువత, మహిళలు, సంఘం ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కులబాంధవులు ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయంగా గడిపారు. జై తెలంగాణ, జై బీసీ, జై మున్నూరుకాపు, మున్నూరుకాపుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు మార్మోగాయి. చివరగా వేదికపై ఉన్న ప్రముఖులంతా చేతులు పైకెత్తి ఐక్యతను చాటారు.

వన సమారాధన మహోత్సవం ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు మున్నూరుకాపుల మధ్య సామాజిక సంబంధాలను బలోపేతం చేసే వేదికగా నిలిచింది. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతను, మహిళలను, వివిధ రంగాల్లో స్థిరపడిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమాజ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కులబాంధవులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular