ట్రంప్ సర్కారుకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట
ఎఫ్, జే, ఐ వీసాదారుల నివాస గడువు కుదింపు నిబంధన కొట్టివేత
డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిర్ణయం ఏకపక్షమన్న న్యాయస్థానం
Setback for Trump administration in court; relief for foreign students
వాషింగ్టన్, నవంబర్ 17:అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులకు భారీ ఊరట లభించింది. వారి నివాస గడువును కుదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ నిబంధన ఏకపక్షంగా, సహేతుకత లేకుండా ఉందని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఉందని న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ వ్యాఖ్యానించారు.
ఎఫ్-1, జే-1, ఐ వీసాలు కలిగిన విదేశీయుల అమెరికా నివాస కాలపరిమితిని తగ్గిస్తూ 2026లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనిపై సెప్టెంబర్ 14న కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. తాజాగా ఆ నిబంధనను కొట్టివేస్తూ తీర్పు వెలువడింది.
విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పరిధిలోని అంశమని, దానిని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుతో ఎఫ్-1 వీసాలపై చదువుకుంటున్న విద్యార్థులు, జే-1 వీసాలపై వచ్చే పరిశోధకులు, ప్రొఫెసర్లు, ఐ వీసాలపై పనిచేసే విదేశీ జర్నలిస్టులకు ఊరట లభించినట్లయింది.
గతంలో ఎఫ్, జే వీసాలపై అమెరికాకు వచ్చినవారు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయ్యే వరకు, నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఉండేందుకు అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల నివాస గడువును నాలుగేళ్లకు పరిమితం చేశారు. అంతకుమించి ఉండాలంటే ఇమిగ్రేషన్ విభాగానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది.
విదేశీ జర్నలిస్టుల విషయంలోనూ ట్రంప్ ప్రభుత్వం పరిమితులు విధించింది. గతంలో ఐదేళ్ల వరకు ఉండే నివాస గడువును 240 రోజులకు తగ్గించింది. చైనా జర్నలిస్టులకు ఈ గడువును 90 రోజులకే పరిమితం చేసింది. తాజా కోర్టు తీర్పుతో ఈ నిబంధనలపై సవాలు చేసిన విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు ఉపశమనం లభించినట్లయింది.




