మొన్న మైక్రోసాఫ్ట్‌.. నిన్న విమానయానం.. నేడు బ్యాంకులు!

- Advertisement -

మొన్న మైక్రోసాఫ్ట్‌.. నిన్న విమానయానం.. నేడు బ్యాంకులు!

అమెరికాను వెంటాడుతున్న వరుస సాంకేతిక అంతరాయాలు
జేపీ మోర్గాన్‌ చేజ్‌ సేవల్లో సాఫ్ట్‌వేర్‌ బగ్‌.. వేలాది ఖాతాదారులకు ఇబ్బందులు

Microsoft the other day… aviation yesterday… and banks today!

వాషింగ్టన్‌, నవంబర్‌ 17: అగ్రరాజ్యం అమెరికాలో కీలక రంగాలను వరుస సాంకేతిక సమస్యలు కలవరపెడుతున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సేవల్లో అంతరాయం, విమానయాన రంగంలో ఏటీసీ నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తగా.. తాజాగా ప్రముఖ బ్యాంకుల ఆన్‌లైన్‌ సేవలపైనా ప్రభావం పడింది. ముఖ్యంగా జేపీ మోర్గాన్‌ చేజ్‌ బ్యాంకు వ్యవస్థలో తలెత్తిన సాఫ్ట్‌వేర్‌ బగ్‌ కారణంగా వేలాది మంది ఖాతాదారులు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చేజ్‌ సేవలపై భారీగా ఫిర్యాదులు

సోమవారం ఉదయం నుంచే అమెరికాలోని పలు బ్యాంకుల ఆన్‌లైన్‌ సేవల్లో సమస్యలు మొదలయ్యాయి. డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు భారీగా నమోదయ్యాయి. ఫార్చ్యూన్‌ కథనం ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత చేజ్‌ సేవలపై సుమారు 4,500 ఫిర్యాదులు రాగా, 2.22 గంటల సమయానికి ఆ సంఖ్య 20 వేలు దాటింది. సీబీఎస్‌ న్యూస్‌ కూడా వేలాది మంది ఖాతాదారులు సమస్యలను నివేదించినట్లు పేర్కొంది.

ఖాతాల్లోకి లాగిన్‌ కాలేకపోవడం, బ్యాలెన్స్‌ తనిఖీ చేయలేకపోవడం, నగదు బదిలీలు, వైర్‌ ట్రాన్స్‌ఫర్లు పూర్తి చేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలూ ప్రభావితమయ్యాయి. కొన్ని బ్యాంకు శాఖల్లోనూ లావాదేవీలు నిలిచిపోయినట్లు ఖాతాదారులు తెలిపారు. టెక్సాస్‌లోని డల్లాస్‌ శాఖలో చెక్కు డిపాజిట్‌ చేసేందుకు వెళ్లిన ఓ ఖాతాదారుడికి సిస్టమ్‌ పనిచేయడం లేదని సిబ్బంది చెప్పినట్లు సీబీఎస్‌ న్యూస్‌ వెల్లడించింది.

సైబర్‌ దాడి కాదు.. సాఫ్ట్‌వేర్‌ బగ్‌

తమ ఆన్‌-ప్రిమైజ్‌ హార్డ్‌వేర్‌ వ్యవస్థల్లో సాఫ్ట్‌వేర్‌ బగ్‌ కారణంగా తాత్కాలిక సమస్య తలెత్తిందని జేపీ మోర్గాన్‌ చేజ్‌ ప్రతినిధి తెలిపారు. ఇది సైబర్‌ దాడి కాదని, అలాంటి ఆధారాలేవీ లేవని స్పష్టం చేశారు. ఖాతాదారులు తమ ఖాతాలు, నిధులను యథావిధిగా యాక్సెస్‌ చేసుకోవచ్చని, అయితే కొన్ని లావాదేవీలు పూర్తవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ సమస్య మొత్తం అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రభావితం చేయలేదని చేజ్‌ స్పష్టం చేసింది. తమ బ్యాంకుతో లావాదేవీలు జరిపే సందర్భాల్లో మాత్రమే ఇతర బ్యాంకుల ఖాతాదారులకు ఆలస్యం ఎదురై ఉండవచ్చని పేర్కొంది.

జెల్లే చెల్లింపులకూ ఆటంకం

అమెరికాలో ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక జెల్లే ద్వారా నగదు పంపడం, స్వీకరించడంలోనూ కొందరు ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తమ నెట్‌వర్క్‌ సాధారణంగానే పనిచేస్తోందని జెల్లే తెలిపింది. బ్యాంకుల సాంకేతిక సమస్యల కారణంగా తమ వేదిక ద్వారా జరిగే లావాదేవీల్లో ఆలస్యం ఏర్పడవచ్చని వివరించింది.

యూఎస్‌ బ్యాంక్‌ కూడా తమ వ్యవస్థలకు నేరుగా ఎలాంటి అంతరాయం కలగలేదని ప్రకటించింది. అయితే ఇతర ఆర్థిక సంస్థలతో జెల్లే ద్వారా జరిగే లావాదేవీల్లో ఆలస్యం ఉండవచ్చని పేర్కొంది. జెల్లేను ఎర్లీ వార్నింగ్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తోంది. ఇందులో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, క్యాపిటల్‌ వన్‌, జేపీ మోర్గాన్‌ చేజ్‌, పీఎన్‌సీ బ్యాంక్‌, ట్రూయిస్ట్‌, యూఎస్‌ బ్యాంక్‌, వెల్స్‌ ఫార్గో వంటి ప్రముఖ బ్యాంకులు భాగస్వాములుగా ఉన్నాయి.

ఇతర బ్యాంకులపైనా ప్రభావం

డౌన్‌డిటెక్టర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, వెల్స్‌ ఫార్గో, యూఎస్‌ బ్యాంక్‌, ట్రూయిస్ట్‌, క్యాపిటల్‌ వన్‌ ఖాతాదారుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, క్యాపిటల్‌ వన్‌ తమ సేవలు సాధారణంగానే ఉన్నాయని వెల్లడించాయి. మరోవైపు వెల్స్‌ ఫార్గో తన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు ప్రకటించింది. ఖాతాదారులు ఏటీఎంలు, బ్యాంకు శాఖలు, ఫోన్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. సోమవారం సాయంత్రానికి చేజ్‌ సేవలను పునరుద్ధరించినట్లు సంస్థ ప్రకటించింది. లావాదేవీలు సాధారణ స్థితికి చేరుకున్నాయని తెలిపింది.

మైక్రోసాఫ్ట్‌ నుంచి విమానయానం వరకు..

ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. ఔట్‌లుక్‌, టీమ్స్‌, ఏఐ అసిస్టెంట్‌ కోపైలట్‌ సహా పలు సేవలు ప్రభావితమయ్యాయి. సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల కార్యకలాపాలపైనా దీని ప్రభావం పడింది. శనివారం నాటికి సేవలను పునరుద్ధరించినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఈ అంతరాయానికి సైబర్‌ దాడి కారణం కాదని సంస్థ స్పష్టం చేసింది.

ఇదే సమయంలో అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) విమానాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలోని కమ్యూనికేషన్‌ పరికరాలు, నెట్‌వర్క్‌లో సమస్య కారణంగా విమానాల బయలుదేరడాన్ని నిలిపివేసింది. ఈ అంతరాయం నాలుగు గంటలకు పైగా కొనసాగడంతో వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి లేదా రద్దయ్యాయి. పాత పరికరాలు, నిర్వహణ సమయంలో కొత్తగా అమర్చిన రౌటర్‌ కారణంగా నెట్‌వర్క్‌ సమస్య తలెత్తినట్లు అధికారులు వివరించారు.

మరోవైపు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా సోమవారం విస్తృత స్థాయి సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో పలు విమానాల బయలుదేరడంలో ఆలస్యం ఏర్పడింది. కొన్ని గంటల్లోనే సమస్యను పరిష్కరించినట్లు సంస్థ ప్రకటించింది. ఇలా వరుసగా కీలక రంగాల్లో సాంకేతిక వ్యవస్థలు విఫలమవుతుండటం అమెరికాలో ఆందోళనకు కారణమవుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular