అపోలోలో ప్రత్యేకంగా ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్’
ఉపాసన కామినేని కొణిదెల చేతుల మీదుగా ప్రారంభం.. తల్లులు, నవజాత శిశువులు, పిల్లలకు ఒకేచోట సమగ్ర వైద్య సేవలు
A dedicated ‘Institute of Parents and Children’ at Apollo
హైదరాబాద్, నవంబర్ 17: మహిళలు, తల్లులు, నవజాత శిశువులు, పిల్లలకు మరింత నాణ్యమైన, ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ‘అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్’ను ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఉపాసన కామినేని కొణిదెల మంగళవారం ఈ వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ తల్లులు, పిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న అపోలో హాస్పిటల్స్ నిబద్ధతకు ఈ ఇన్‌స్టిట్యూట్ నిదర్శనమని తెలిపారు. ప్రతి తల్లికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని, ప్రతి బిడ్డ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు, ఆ తర్వాత నవజాత శిశువులు, పిల్లలకు అవసరమైన వైద్య సేవలన్నీ ఒకే చోట అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేక ఆబ్స్టెట్రిక్స్ విభాగం, లెవల్-3 నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ), పెరినాటల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్, పిండం ఆరోగ్య పరీక్షలు, అధిక ప్రమాద గర్భధారణల నిర్వహణ, మెటర్నిటీ కేర్, ప్రసవ సేవలతో పాటు నవజాత శిశువులు, పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఫణి జ్యోత్స్న మాట్లాడుతూ మహిళల జీవితంలోని ప్రతి దశలో వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించడంతో పాటు, నవజాత శిశువులు, పిల్లలకు అవసరమైన చికిత్సలు ఇక్కడ అందిస్తామని తెలిపారు. వివిధ వైద్య విభాగాల సమన్వయంతో వ్యాధులను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతుందని వివరించారు.
డాక్టర్ పూజిత దేవి మాట్లాడుతూ అధునాతన ఇంటెన్సివ్ కేర్ సదుపాయాలతో పాటు నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్‌ఐసీయూలో శిశువుల ఆరోగ్యం, ఎదుగుదలకు తోడ్పడే కంగారూ మదర్ కేర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
డాక్టర్ శ్రవంతి రెడ్డి, డాక్టర్ రఘుపతి ఆర్, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిషియన్ డాక్టర్ ఎస్.ఎల్. నరసింహారెడ్డి మాట్లాడుతూ రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ కేంద్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ప్రైవేట్ కన్సల్టేషన్ గదులు, ప్రొసీజర్ రూమ్స్, ఫీడింగ్ లాంజ్‌లు, సౌకర్యవంతమైన ఇన్‌పేషెంట్ వసతులతో పాటు పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.




