
మోరంచపల్లిలో అతలాకుతలం
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మోరంచ పల్లి గ్రామంలో మొరంచ వాగు పెను విషాదం మిగిల్చింది. అర్ధరాత్రి అందరు నిద్రిస్తుండగా సునామీలా దూసుకు వచ్చిన వరద ఉధృతికి గ్రామం ఒక్కసారిగా అతలాకుతులమైంది. ప్రస్తుతం మొరంచ వద్ద పూర్తిగా వరద ఉధృతి పూర్తిగా తగ్గింది. గ్రామంలో ఎటు చూసినా బాధిత ప్రజల ఆహకారాలు కలిచి వేస్తున్నాయి. తమ తమ గృహాలకు చేరుకొని జరిగిన విధ్వంసానికి కన్నీరుమున్నీరు అవుతున్నారు. సుమారు 250కి పైగా నివాస గృహాలు ఉండే ఈ గ్రామంలో 600 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వరదల వలన గ్రామానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటికీ తెలియ రాలేదు. వరదల్లో చిక్కుకున్న స్థానిక ప్రజలను బొట్ల ద్వారా రక్షించి గాంధీ నగర్, కర్కపల్లి ల వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వసతి కల్పించారు. వరదల్లో చిక్కుకొని సుమారు 150 కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని పశువులువరద తాకిడికి కొట్టుకుపోయాయి. నివాస గృహాలు ఎక్కడికక్కడ ధ్వంసం అయ్యాయి. ఇండ్లలో ఉండే గృహపకరణాలు, సామాగ్రి అన్ని కొట్టుకుపోయాయి. వరద ప్రభావంతో కుందయ్యపల్లి మొరంచ గ్రామాల మధ్య రహదారి పూర్తిగా ధ్వంసమైంది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకొని పరిస్థితులు సమీక్షిస్తున్నారు.


