Saturday, December 14, 2024

నల్గోండలో త్రిముఖ పోటీ

- Advertisement -

నల్గోండలో త్రిముఖ పోటీ
నల్గోండ, ఏప్రిల్ 23
నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ శ్రమిస్తుంటే మోదీ చరిష్మాతో గెలిచేందుకు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి గెలుపు మాదేనంటూ బీఆర్ఎస్ అంటోంది.నల్గొండ లోక్ సభా నియోజకవర్గంలో విజయం కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. నల్గొండ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా వామపక్షాలు 8 సార్లు, కాంగ్రెస్ 6, టీడీపీ 2, టీఆర్ఎస్ 1 సారి చొప్పున ఇక్కడ గెలిచాయి. ప్రస్తుత శాసన మండలి ఛైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకసారి టీడీపీ నుంచి మరో రెండు సార్లు (2009, 2014)లో కాంగ్రెస్ నుంచి మొత్తంగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించిన నేతగా రికార్డు నెలకొల్పారు. కాగా, ఈ సారి ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి కంచర్ల క్రిష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు. నల్గొండ ఎంపీ స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో తమ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ శ్రమిస్తోంది. మూడు పార్టీలు గెలుపు కోసం ప్రయత్నిస్తుండడంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది.నల్గొండ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగానే శ్రమిస్తోంది. ఈ స్థానం నుంచి వరసగా గెలుస్తూ వస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలిచింది. 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. కాగా ఈ సారి పార్టీ సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డికి(K  టికెట్ లభించింది. నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి విజయం సాధించగా, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్గొండ ల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో ఈ అంశం తమకు లాభిస్తుందని, కచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ లోకి వలస వెళుతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో బలంగా తయారయ్యామన్న ధీమాలో ఆ పార్టీ ఉంది.బీజేపీ ఈ ఎన్నికల్లో నల్గొండ సీటును దక్కించుకుంటామన్న ఆశలో ఉంది. ఆ పార్టీ ముందు నుంచి తమ పార్టీలో ఉన్న నాయకులకు కాకుండా ఎన్నికల ముందే తమ పార్టీ తీర్థం పుచ్చుకున్న, బీఆర్ఎస్ నాయకుడు, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో బీజేపీకి నామమాత్రంగా కూడా పట్టులేకున్నా, కేంద్రంలో ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ అని, మోదీ మూడో సారి ప్రధాని అవుతారని ప్రచారం చేస్తూ.. మోదీ( చరిష్మాతో గట్టెక్కుతామన్న ధీమాలో ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో ఉన్న పొత్తులో భాగంగా ఈ సీటులో బీజేపీ పోటీ చేయలేదు. కాగా, 2019లో పోటీ చేసినా ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు కేవలం 52,709 మాత్రమే. కానీ, ఈ సారి పరిస్థితి మారిందని, మోదీ గాలి మరింతగా వీస్తోందని , కచ్చితంగా గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 1991 లో మూడో స్థానంలో, 1996 లో రెండు స్థానంలో, 1998 ఎన్నికల్లో మూడో స్థానంలో, 2004ల ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4,23,360 ఓట్లు సాధించింది. తమ ఖాతాలో విజయాలు లేకున్నా బలమైన ఓటు బ్యాంకు ఉందని, ఈ సారి తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో విజమన్న గట్టి నమ్మకంలో బీజేపీ నాయకత్వం ఉంది.నల్గొండ లోక్ సభ స్థానంలో గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ సీటును ఆ పార్టీ కీలకంగా భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల్లో బీఆర్ఎస్ 2014లో భువనగిరిలో విజయం సాధించింది. కానీ, ఆ పార్టీకి నల్గొండ దక్కకుండా పోయింది. ఈ సారి ఆ పార్టీ నుంచి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల క్రిష్ణారెడ్డిని పోటీకి పెట్టింది. 2014 ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితం అయిన బీఆర్ఎస్ 2019 ఎన్నికల్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ ఎన్నికల్లో విజయంపై ఆశలు పెట్టుకున్నా.. నియోజకవర్గం పరిధిలో ఏడు సెగ్మెంట్లలో కేవలం ఒక్క సూర్యాపేటలో మాత్రమే ఎమ్మెల్యే ఉండడం, అంతే కాకుండా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నుంచి కాంగ్రెస్( కు వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, వారి పాలనపై ప్రజలకు భ్రమలు తొలిగాయి కాబట్టి ఈ సారి తమ పార్టీ వైపే మొగ్గు చూపుతారని భావిస్తోంది. నియోజకవర్గ పరిధిలో మిర్యాలగూడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ 24వ తేదీన ప్రచార యాత్ర మొదలు పెట్టనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్