- Advertisement -
హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం
A tropical cyclone in the Indian Ocean and Southeast Bay of Bengal
* ఉత్తర హిందు మహాసముద్రంలో ఇది మూడో తుఫాను
* ఈ తుఫానుకు ‘ఫెంగల్’గా నామకరణం
* తుఫానుగా మారింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం
* తుఫాను ప్రభావంతో ఏపీతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో మూడురోజుల పాటు భారీ వర్షాలు
విశాఖపట్టణం నవంబర్
హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో ఏపీతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నెల్లూరు జిల్లాలో మంగళవారం నుంచి కుండపోత వర్షం పడుతున్నది. సముద్రతీరం వెంట భారీగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడువ్యాప్తంగా భారీ వర్షాలుపడుతున్నాయి. కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లో అతిభారీలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో చెన్నైతో సహా తొమ్మిది జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నాగపట్నం జిల్లాలో వానలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి.రాబోయే మరో 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక తుఫానుకు ‘ఫెంగల్’గా నామకరణం చేశారు. ఇది ఉత్తర హిందు మహాసముద్రంలో మూడో తుఫాను కాగా.. రెండో తీవ్రమైన తుఫాను. ఉత్తర హిందూ మహాసముద్రంలోని తుఫానులకు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (UNESCAP) ప్యానెల్‌లోని సభ్య దేశాలు పేరు పెట్టాయి. ఈ ప్యానెల్‌లో భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ ఉన్నాయి. ఈ తుఫానులకు పేరు పెట్టే సాంప్రదాయాన్ని అమెరికా మొదలుపెట్టింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. వేర్వేరు తుఫానులు వచ్చిన సమయంలో సులభంగా గుర్తించడంతో పాటు వాతావరణశాఖవేత్తలు, మీడియా ప్రజలకు సమాచారాన్ని సమర్థవంతంగా అందించడంతో పాటు హెచ్చరికలు చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టే పెట్టేందుకు ఏప్రిల్ 2020లో 13 దేశాలు గ్రూప్‌గా ఏర్పాటయ్యాయి. సభ్య దేశాలు ఆయా దేశాలు తమ సంస్కృతికి అనుగుణంగా పేర్లను ప్రతిపాదిస్తుంటాయి. ఇప్పటి వరకు 169 పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. పేర్లు వీలైనంత వరకు చిన్నగా ఉండాలి.. అదే సమయంలో ఒక దేశ సంస్కృతితో ఎట్టి పరిస్థితుల్లోనూ ముడిపడి ఉండకుండా చూడాల్సి ఉంటుంది. అలాగే, పెడర్థాలు వచ్చేలా ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఒకసారి ఒక తుఫానుకు పేరును పెట్టాక.. మళ్లీ ఆ పేరును మళ్లీ ఉపయోగించరు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ‘ఫెంగల్’గా నామకరణం చేశారు. ఈ పేరును సౌదీ అరేబియా ప్రతిపాదించింది. మళ్లీ ఏదైనా తుఫాను వస్తే శ్రీలంక సూచించిన పేరు ‘శక్తి’ పేరు పెట్టనున్నారు.
- Advertisement -