అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అబ్దుల్ సత్తార్ నామినేషన్.
కర్నూలు
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి. సృజనకు కు ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.అత్యంత నిరాడంబరంగా అబ్దుల్ సత్తార్ తన నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసిపి, తెలుగుదేశం పార్టీలను కర్నూలు పార్లమెంటు ప్రజలు చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కర్నూలుజిల్లా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ,ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలుజిల్లాకు పరిశ్రమలు తెప్పించి ,నిరుద్యోగులకు, కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. పేద బడుగు, బలహీన వర్గాలు, రోడ్డు సైడ్ వ్యాపారస్తులకు మునిసిపల్ రుసుమును రద్దు చేస్తానన్నారు. ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు .కర్నూలు ప్రజల కు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని అబ్దుల్ సత్తార్ చెప్పారు. వైఎస్ఆర్సిపి నాయకులు కేంద్రంలోని బిజెపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్ఆర్సి, సిఎ ఏ బిల్లులకు మద్దతు ఇస్తూ, వక్ఫ్ బోర్డు రద్దుకు , త్రిపుల్ తలాక్ రద్దు బిల్లు,ముస్లిం వ్యతిరేక చట్టాలన్నింటికీ పార్లమెంటులో బిజెపి ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చి ,ముస్లింలకు తీరని ద్రోహం చేసి బిజెపికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను బిజెపి రద్దు చేస్తానన్నా పల్లెత్తు మాట మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టిన టిడిపి, వైసిపిలు బిజెపితో స్వలాభం కోసం జట్టు కట్టి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా కర్నూలు జిల్లాలో అధిక జనాభా ఉన్న ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. ముస్లిం సోదరులందరూ ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ,నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిన బిజెపికి ,దానికి కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్న టిడిపి, వైసిపి పార్టీల అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి ,ఓడించి ,అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు . పాతికేళ్లుగా సీనియర్ జర్నలిస్టుగా, విద్యార్థి నాయకుడిగా , ముస్లిం మైనారిటీ నాయకుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ప్రజల కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన తన లాంటి యువతకు ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో ఎంపీ గా గెలిపించాలని అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు.తన గెలుపు కర్నూలు ప్రజలందరికి గెలుపు అవుతుందని అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు.