గనుల శాఖ సర్వేయర్‌కు ఏసీబీ వల..
రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
అనకాపల్లి
గనులు మరియు భూగర్భ శాఖ (మైన్స్ అండ్ జియాలజీ) కార్యాలయంలో మైనింగ్ సర్వేయర్ అంబేద్కర్ మురళిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఓ క్వారీకి సంబంధించిన సర్వే నివేదిక మంజూరు చేసేందుకు రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, అంబేద్కర్ మురళిపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2018లో విశాఖపట్నంలో రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నమోదైన కేసుతో ఇది ఆయనపై రెండో ఏసీబీ కేసుగా నిలిచింది.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.




