- Advertisement -
అచ్నెన్న వర్సెస్ కూన రవి
Achnenna vs. Koona Ravi
శ్రీకాకుళం, నవంబర్ 25, (వాయిస్ టుడే)
ఒకరేమో మంత్రి అచ్చెన్నాయుడు. మరొకరేమో ప్రభుత్వ మాజీ విప్ కూన రవి.. ఉమ్మడి శ్రీకాకుళం జల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులైన ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. పార్టీకి వీరవధేయులైన ఆ ఇద్దరు నేతలు జిల్లా వ్యవహారాల్లో స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారట. దాంతో జిల్లా టీడీపీశ్రేణులు, ప్రభుత్వ యంత్రాంగం కొంత ఇబ్బంది పడుతున్నాయట. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ఒకరి ని సపోర్ట్ చేయలేక..మరొకరికి దూరంగా ఉండలేక తలలు పట్టుకుంటున్నారంట.
సిక్కోలు జిల్లా టిడిపిలో గ్రూప్ పాలిటిక్స్ కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జిల్లా వాసులు ఆ గ్రూప్ పాలిటిక్స్‌ను, ఆ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరును ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చూస్తునే ఉన్నారు. జిల్లా టీడీపీలో నిన్న మొన్నటి వరకు కిమిడి కళావెంకట్రావ్ గ్రూపు , వర్సెస్ కింజరాపు ప్యామిలీగా వార్ ఉండేది. అయితే 2024 ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ టిడిపి సమన్వయకర్తగా ఉన్న కళా వెంకట్రావుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ కేటాయించి శ్రీకాకుళం జిల్లా నుంచే పంపించేశారు.ఇక కళావెంకట్రావు గ్రూపుకే చెందిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ దంపతులకు శ్రీకాకుళం టికెట్ దక్కలేదు. అలాగే మాజీ స్పీకర్ ప్రతిభ భారతిని కాదని రాజాం టికెట్‌ను కొండ్రు మురళికి కేటాయించారు. ఇలా మొత్తంగా ఈసారి ఎన్నికలలో కళా వెంకట్రావు గ్రూపుకు గట్టిగానే చెక్ పడింది. అయితే కళా వెంకట్రావు విజయనగరం జిల్లాకు వెళ్లిపోయినప్పటికీ ఇప్పుడు ఆయన ప్లేసును ఆమదాలవలస టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ భర్తీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది.కూన రవికుమార్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపి ప్రభుత్వ విప్ గా పని చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గాలలో ఒకటైన కలింగ సామాజికవర్గానికి చెందిన నేత కూన రవి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై విజయం సాధించడంతో కూన రవికుమార్ కు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కింజరాపు ప్యామిలికే కేంద్ర , రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి.అమాత్య యోగం దక్కని కూనరవికుమార్ కి మంచి నామినేటెడ్ పోస్ట్ లభిస్తుందని ఆయన వర్గం ఆశించింది. అది కూడా దక్కలేదు. పైపెచ్చు ఇటీవల కూన రవి సామాజిక వర్గానికే చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళo అశోక్ కు ప్రభుత్వ విప్ గా స్థానం కల్పించి పార్టీ అధిష్ఠానం రవికి ఝలక్ ఇచ్చింది. రవికి పదవులు అందినట్టే అంది చేజారటం వెనుక అదృశ్య శక్తులుగా శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చం నాయుడు ఉన్నారని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.జిల్లాలో పొలిటికల్ గా మరో పవర్ సెంటర్ తయారు కాకుండా జాగ్రత్త పడటంలో భాగంగా అధినేత వద్ద బాబాయ్, అబ్బాయి తమ పలుకుబడిని కూన రవికుమార్ కి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారట. అది తెలిసి కూన రవికుమార్ సైతం కింజరాపు కుటుంబంపై గుర్రుగా ఉన్నారంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మినహా ఆయన వీలైనంతవరకు అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడుల కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కొన్ని సందర్భాలలో ఎదురు పడిన పెద్దగా మాట మంతి కూడా ఉండటం లేదు. ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లు వద్దని తిరస్కరించారు రవి. తనకు సింపులుగా ఉండటమే ఇష్టమని రవి పైకి చెప్పినప్పటికి..మంత్రి పదవి దక్కని కారణoగా గన్ మెన్లను తిరస్కరించి తన అసంతృప్తిని వెళ్లగక్కారు అని అంతా భావిస్తున్నారు.మంత్రి పదవులు దక్కాక మొదటిసారి జిల్లాకి వచ్చిన రామ్మోహన్ నాయుడు, అచ్చంనాయుడులకి విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు అభిమానులు. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లా కి వచ్చిన రవికి ఆయన స్వాగతం పలికి బలప్రదర్శన చేశారు. జిల్లా సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఆముదాలవలస నియోజకవర్గ సమస్యలే కాకుండా సీనియర్ నేతగా, మిగతా నియోజకవర్గాలు, జిల్లా సమస్యల పైన గళం విప్పుతున్న కూన రవి పార్టీలో పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారు.సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూన రవి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుని టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో జరిగిన మొదటి జెడ్పీ సమీక్ష సమావేశంలో రైతులకు ఎక్కడ ఎరువులు అందలేదని తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో సైతం స్వపక్షంలో విపక్షంలe మంత్రి అచ్చం నాయుడును టార్గెట్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో జీడి, కొబ్బరి రైతులను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తుతున్న అంశాలను మంత్రులు కనీసం రాసుకోవడం లేదని డైరెక్ట్‌గా అచ్చెన్నాయుడ్నే టార్గెట్ చేయడంతో.. ఆయన లెగిసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.అసలే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో కుల ప్రధాన్యత అధికం. కాలింగ, తూర్పుకాపు, వెలమ సామాజిక వర్గాల హవా జిల్లాలో ఎక్కువగా నడుస్తుంది. ఈ మూడు బిసి కులాల మద్య అన్ని పార్టీల్లో ఆధిపత్యపోరు నడుస్తుంటుంది. ఆ క్రమంలో పార్టీ అధిష్ఠానం జిల్లా రాజకీయాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాదని సామాజిక వర్గాల సమతుల్యం పాటించకపోతే తగిన మూల్య చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
- Advertisement -