బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. తాజాగా కొన్ని అరుదైన చిత్రాలను పంపింది. భానుడి పూర్తి గోళాన్ని 200-400 నానోమీటర్ల తరంగ దైర్ఘ్య పరిధిలో తొలిసారి క్లిక్‌మనిపించింది. ఈ ఉపగ్రహంలోని సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) ఈ ఘనత సాధించింది. సౌరకుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయి అని ఇస్రో అభివర్ణించింది. 11 ఫిల్టర్లను ఉపయోగించి ఈ చిత్రాలను తీసినట్లు వివరించింది. సౌర మచ్చలు, సూర్యుడిలో ఒకింత ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు, భానుడి ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌ల గురించి లోతైన అంశాలను తెలుసుకోవడానికి ఇవి సాయపడతాయని తెలిపింది. ఆదిత్య-ఎల్1ను ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి ప్రయోగించారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్1 ప్రాంతం దిశగా దీని పయనం సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి అది తన గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో ఇటీవల తెలిపింది.