ఇక ఓఆర్ఆర్ పై మోత
హైదరాబాద్, మార్చి 31, (వాయిస్ టుడే)
Now, the price on ORR
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెరిగాయి. అయితే పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. టోల్ ఛార్జీలు కిలో మీటర్ కు స్వల్పంగా పెంచింది.కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్ కు కిలోమీటర్ కు ఇప్పటి వరకు 2 రూపాయల 34 పైసలు ఉండగా.. ఇప్పడు పది పైసలు అదనంగా పెంచారు. అంటే ఇక నుంచి కిలోమీటర్ కు 2 రూపాయల 44 పైసల చొప్పున వసూలు చేయనున్నారు. మినీ బస్, ఎల్‌సీవీ వాహనాలకు కిలోమీటర్ కు 20 పైసలు పెంచారు. బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కిలో మీటర్ కు 31 పైసలు పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటర్ కు 70 పైసలు పెంచుతూ ఐఆర్ బీ నిర్ణయం తీసుకుంది.మినీ బస్, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 పైసల నుంచి రూ.3.94కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డబుల్ యాక్సిల్ బస్సులకు కి.మీకు రూ.6.69 నుంచి రూ.7కు వరకు పెంచారు. ఓఆర్ఆర్ పై ప్రయాణించే హెవీ వెహికల్స్‌కు కిలోమీటర్ కు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది.ఓఆర్ఆర్ పై టోల్ వసూలు చేసుకునేందుకు గత ప్రభుత్వం ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థతో టోల్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ పద్ధతిలో 30 ఏళ్లు లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పలు నేషనల్ హైవేలను కలుపుతున్నది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కి దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్ ఎక్స్ ఛేంజ్ జంక్షన్లు ఉంటాయి. మున్ముందు అభివృద్ధి అంతా ఓఆర్ఆర్ చుట్టూనే ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ చుట్టు ప్రాంతాల్లో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.ప్రతి రోజు ఓఆర్ఆర్ పై 1.40 లక్షల నుంచి 1.45 లక్షల వరకు వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఐఆర్ బీ ఇన్ ఫ్రా సంస్థకు నెలకు రూ.60 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. అయితే, సంస్థ మరింత ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు టోల్ గేట్ ఛార్జీలను తాజాగా పెంచింది. దీంతో సంస్థ మరింత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే ఓఆర్ఆర్ ను ప్రైవేట్ కు అప్పగించాలని ఏకంగా 30 ఏళ్ల లీజు కోసం రూ.7380 కోట్లకు కట్టబెట్టారు. అయితే ఓఆర్ఆర్ నిర్వహణ భారాన్ని ఐఆర్ బీ ఇన్ ఫ్రా సంస్థకు అప్పగించకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు.